కేటీఆర్ బావోద్వేగం : నాడు పాఠశాల .. నేడు కళాశాల !
అదే సమయంలో వివిధ సంధర్భాల్లో తన కుటుంబం, తన బిడ్డ, కుమారుడితో ఉన్న అనుబంధాలను కూడా తరచూ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటూ ఉంటారు.
By: Garuda Media | 3 Sept 2026 12:56 PM ISTభారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే సోషల్ మీడియా ఖాతాలలో చురుగ్గా ఉంటారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతగా రాజకీయ విమర్శలు, ఆరోపణలకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సమస్యలతో పాటు, తన దృష్టికి వచ్చే అంశాల మీద స్పందించి తన వంతు సహాయాన్ని అందిస్తుంటారు. అదే సమయంలో వివిధ సంధర్భాల్లో తన కుటుంబం, తన బిడ్డ, కుమారుడితో ఉన్న అనుబంధాలను కూడా తరచూ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటూ ఉంటారు.
కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇప్పటికే అమెరికాలోని యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆయన కూతురు అలేఖ్య కూడా పాఠశాల చదువులు దాటి అమెరికాలోని ఒక యూనివర్శిటీలో పై చదువులకు వెళ్లింది. ఇటీవల అమెరికా వెళ్లి తన కూతురును కళాశాలలో చేర్చిన నేపథ్యంలో కాలం వేగంగా సాగిందని, తన కూతురు కళాశాలకు వెళ్లేంతలా ఎదిగిపోయిందని తన కూతురితో వివిధ సంధర్భాల్లో ఉన్న ఫోటోలను షేర్ చేసి తన బావోద్వేగాన్ని పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో తండ్రి, కూతుళ్ల అనుబంధం మీద నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
తన కుమారుడు, కుమార్తెతో ఉన్న వ్యక్తిగత బంధాన్ని కేటీఆర్ తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. అలేఖ్య ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు పేరెంట్ - టీచర్ మీటింగ్ కు వెళ్లిన కేటీఆర్ ‘శాసనసభలో చర్చల కంటే, ఎన్నికల కంటే, కూతురి పీటీఎంకు వెళ్లినప్పుడే ఎక్కువ టెన్షన్’ అని పోస్ట్ చేశారు. కూతురి ప్రోగ్రెస్ రికార్డు చూసి గర్వపడ్డారు.
డాటర్స్ డే సంధర్భంగా ‘నా ప్రపంచం నీ చుట్టూ తిరుగుతుందని’ పోస్ట్ చేశారు. 2023లో కుమారుడు హిమాన్ష్ కళాశాలకు వెళ్లినప్పుడు ‘నిన్నటి వరకు చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాడు. నా భాగం తీసుకెళ్తున్నాడు’ అని పోస్ట్ చేశారు. కేటీఆర్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా పిల్లల చదువులు, వారి ఎదుగుదల మీద శ్రద్ద చూయిస్తారని సమాచారం. తాజాగా తన కూతురు కళాశాలకు వెళ్లడాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకోవడం విశేషం.
