'బాకీ కార్డు'లతో ఎన్నికలకు వెళ్తాం: కేటీఆర్
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో నాయకుల మాటలు తూటాల్లా పేలుతున్నాయి.
By: Garuda Media | 29 Sept 2025 5:43 PM ISTతెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో నాయకుల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా చేస్తామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిం చారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల సమరంలో బీఆర్ ఎస్ దూసుకుపోతుందన్నారు. దీనికి కారణం.. కాంగ్రెస్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను ఒక్కదానిని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బకాయి పడిందని ఆరోపించారు.
ఈ క్రమంలో తాము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంత మేరకు బకాయి పడిందో లెక్కలు తీసినట్టు కేటీఆర్ వివరించారు. సమాజంలోని అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పడిందన్న ఆయన.. ఏయే వర్గాలకు ఎంతెంత బకాయి పడ్డారో.. అన్ని వివరాలను నమోదు చేసుకున్నట్టు వివరించారు. ఈ క్రమంలోనే `బాకీ కార్డు`లను రూపొందించామని మాజీ మంత్రి చెప్పారు. బాకీ కార్డులతోనే ఎన్నికల్లో ప్రతి ఇంటికీ తమ పార్టీ కార్యకర్తలు తిరుగుతారని.. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ద్రోహం చేసిందో వివరిస్తారని ఆయన చెప్పడం గమనార్హం. అంతేకాదు.. ఈ ఎన్నికలు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాణసంకటంగా మారాయన్నారు.
స్థానిక ఎన్నికల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందన్న కేటీఆర్.. హైకోర్టు తీర్పుతోనే దిగి వచ్చిందన్నారు. రిజర్వేషన్‌ను అడ్డుపెట్టుకుని మళ్లీ ఆపేప్రయత్నం చేసిందని తెలిపారు. దీనికి కారణం.. ప్రజల్లో కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తమవుతుండడమేనని చెప్పిన ఆయన.. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్టులేకపోవడం పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఎన్నికలు ఏవైనా తమ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ``ఒక్క లోకల్ బాడీనే కాదు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికైనా మాకు అనుకూలమే`` అని చెప్పారు. కేసీఆర్‌ను తిరిగి తెచ్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు పట్టెడు అన్నం పెట్టడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నగరం కట్టేందుకు రెడీ అయిందని ఫ్యూచర్ సిటీపై ఎద్దేవా చేశారు.
