హాట్ టాపిక్: కేటీఆర్ గజనిలా మారారా?
పార్టీ పరువును ఎవరో తీయక్కర్లేదని.. కేటీఆర్ మాటలు చాలని.. ఆయన మాటలతో జరుగుతున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By: Garuda Media | 18 Sept 2025 1:00 PM ISTగజని అన్నంతనే గజనీ సుల్తాన్ అనుకునేరు. కొన్నేళ్ల క్రితం గజని అన్న మూవీ వచ్చి.. బ్లాక్ బాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇందులో హీరో అనూహ్య పరిస్థితుల్లో గతాన్ని తరచూ మర్చిపోతుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ వైఖరి సైతం ఇదే రీతిలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు ఆయన చేస్తున్నవ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు. పార్టీ పరువును ఎవరో తీయక్కర్లేదని.. కేటీఆర్ మాటలు చాలని.. ఆయన మాటలతో జరుగుతున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆయన మాట్లాడే మాటలకు రాజకీయ ప్రత్యర్థుల వరకు ఎందుకు..రాజకీయాల గురించి ఓనామాలు తెలిసిన వారు సైతం ఇట్టే కౌంటర్లు ఇచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు. కేటీఆర్ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు.. పదేళ్లు కేసీఆర్ పాలనలో చోటు చేసుకున్న ఎన్నో అంశాల్ని రిలేట్ చేసేలా ఉంటున్నాయని.. వాటితో పోల్చి చూసినప్పుడు.. ఫవర్ ఫుల్ గా కనిపించే మాటలు సైతం కామెడీగా మారుతున్నట్లుగా చెబుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారన్న కేటీఆర్ తాజా వ్యాఖ్యల్నే తీసుకుంటే.. ఈ విషయాన్ని ఆయన తప్పించి ఇంకెవరు అనటం లేదన్న మాట వినిపిస్తోంది. మొన్నటికి మొన్న ఉన్నత విద్యను బోధించే కాలేజీ వాళ్లు సైతం సమ్మె చేస్తే.. 48 గంటల్లో ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొని.. సమ్మె ముగిసేలా చేశారని.. నిజంగానే రేవంత్ ప్రభుత్వం నియంతలా ప్రవర్తిస్తే.. అలా జరిగేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆరర్ హయాంలో జరిగిన ఆర్టీసీ సమ్మెను గుర్తు చేస్తూ.. అప్పట్లో ఆర్టీసీ ఉద్యోగులు చేసుకున్న ఆత్మహత్యల్ని కేటీఆర్ మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు.
మొన్నటికి మొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగానికి చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. త్వరలోనే తాను మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్నట్లుగా పేర్కొన్న రేవంత్.. ఆ సందర్భంలో ఒక్క పోలీసు కూడా క్యాంప్ లో ఉండొద్దని.. నిరసన వ్యక్తం చేసే హక్కు విద్యార్థులకు ఉందని.. అలాంటి వారితో తానే నేరుగా మాట్లాడతానని చెప్పటాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ.. రేవంత్ సర్కారు నిజంగానే నియంతలా వ్యవహరిస్తే.. ముఖ్యమంత్రే స్వయంగా ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితిపై మాట్లాడిన కేటీఆర్..వారి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారిందన్న వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎంతోమంది ఇతర పార్టీల నేతల్ని గులాబీ కారులో ఎక్కించటాన్ని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ నిజంగా మగాడైతే.. ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారని.. పదేళ్ల కేసీఆర్ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మగతనం గురించి మాట్లాడుతున్న కేటీఆర్.. తమ ప్రభుత్వంలో వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. మరి అప్పటి వేళ ఎవరి మగతనం గురించి మాట్లాడాలి? అని ప్రశ్నిస్తున్నారు.
పదేళ్ల తమ పాలనలో తాము చేసిన పనులను కాస్త గుర్తు పెట్టుకొని.. వాటిని మనసులో ఉంచుకొని.. తాను మాట్లాడే మాటలు వాటిలో రిలేట్ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే పరువు దక్కుతుందని గులాబీ శ్రేణులు వాపోతున్నాయి. కేటీఆర్ ఏం మాట్లాడినా..చివరకు అవన్నీ వచ్చి తమకే తగులుతున్నాయని.. వాటిని రాజకీయ పార్టీలు ప్రశ్నించటం కాదు.. ప్రజలే ఆ పని చేస్తున్న విషయాన్ని కేటీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది.
