Begin typing your search above and press return to search.

చ‌ర్చ‌కు మేం రెడీ.. డేటు, టైము చెప్పండి: రేవంత్‌కు కేటీఆర్ ఆఫ‌ర్‌

రాజ‌కీయంగా త‌మ‌ను ఎదుర్కొన‌లేక‌, గ‌త బీఆర్ఎస్ ప్ర‌భు త్వంపై సీఎం రేవంత్ రెడ్డి త‌ప్పుడు స‌మాచారం ప్ర‌చారం చేస్తున్నార‌ని బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్‌నేత‌, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

By:  Garuda Media   |   1 July 2026 10:50 PM IST
చ‌ర్చ‌కు మేం రెడీ.. డేటు, టైము చెప్పండి:  రేవంత్‌కు కేటీఆర్ ఆఫ‌ర్‌
X

తెలంగాణ రాజ‌కీయాలు స‌వాళ్ల దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. రాజ‌కీయంగా త‌మ‌ను ఎదుర్కొన‌లేక‌, గ‌త బీఆర్ఎస్ ప్ర‌భు త్వంపై సీఎం రేవంత్ రెడ్డి త‌ప్పుడు స‌మాచారం ప్ర‌చారం చేస్తున్నార‌ని బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్‌నేత‌, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్ర‌చారాల‌ను వీధి వీధికీ వెళ్లి తిప్పికొట్టాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి స‌గ కాలం గ‌డిచిపోయింద‌ని అన్నారు. మ‌రో రెండున్నరేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉంద‌న్నారు.

ఎన్నిక‌ల వేళ‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌లేద‌న్నారు. అదే స‌మ‌యంలో ఢిల్లీకి వెళ్తే ప‌రువు పోతోంద‌ని చెబుతున్నార‌ని ఇవ‌న్నీ బూట‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 72 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డికి ప‌రువు ఉందా? అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ హ‌యాంలో ప‌దేళ్ల కాలంలో 3.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను మాత్ర‌మే అప్పులు చేశామ‌ని.. కానీ, రేవంత్ మాత్రం తాము 8 ల‌క్ష‌ల కోట్ల‌పైగా అప్పులు చేసిన‌ట్టు దుష్ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ఈ వ్య‌వ‌హారంపైచ‌ర్చ‌కు తాను సిద్ధ‌మేనని కేటీఆర్ చెప్పారు. టైము, డేటు , ప్లేసు చెబితే.. ఆధారాల‌తో స‌హా వ‌స్తాన‌ని కేటీఆర్ స‌వాల్ రువ్వారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రాన్ని స‌స్య‌శ్యామ‌లం చేశార‌ని అన్నారు. 26 ల‌క్ష‌ల హెక్టార్ల నుంచి 56 ల‌క్ష‌ల హెక్టార్ల‌కు పెంచార‌ని తెలిపారు. కేంద్రం త‌మ‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేద‌ని.. అయినా.. రైతుల‌కు న్యాయం చేశామ‌న్నారు. హైదరాబాద్‌ను చూసి న్యూయార్క్‌లా ఉందని రజనీకాంత్ అన్న విష‌యాన్ని కేటీఆర్ ప్ర‌స్తావించారు. బీఆర్ఎస్ పాల‌న‌ను, కేసీఆర్ ను విమర్శించ‌డ‌మే రేవంత్ రెడ్డి ప‌నిగా పెట్టుకున్నారని దుయ్య‌బ‌ట్టారు.

కేసుల‌కు వెర‌వం!

కేసుల‌కు వెర‌చే ప్ర‌స‌క్తేలేద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. త‌మ‌ను ఎంత దూషిస్తే.. అంత‌గా తాము ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతామన్నారు. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెప్పేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామ‌న్నారు. తెలంగాణ గొప్పతనం, ఎదుగుదల సీఎంకు అర్ధం కావ‌డం లేద‌ని.. కేసీఆర్ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిని చూసి ఓర్వ‌లేక పోతున్నార‌ని వ్యాఖ్యానించారు. ``ప‌రిపాల‌న చేత‌నైత‌దా? అయితే.. మా ప్ర‌భుత్వంపై ప‌డి ఏడుపు ఎందుకు?`` అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌భుత్వం కోసమే నిర్మించామ‌ని.. దీనిని కాద‌ని ప్ర‌జాధ‌నం వెచ్చించి మ‌రో క్యాంపుకార్యాల‌యం నిర్మించుకున్నార‌ని..ఇదేమైనా శాశ్వ‌త‌మా? అని నిల‌దీశారు.