రీలు తిరిగినంత సులభంగా రాజకీయాల్లో గెలుపు చక్రం తిరగదు కేటీఆర్ సార్?
సినిమా అంటే ఒక రెండున్నర గంటల మాయాజాలం. థియేటర్ చీకట్లో కూర్చున్న ప్రేక్షకుడు కథలోని ఎమోషన్‌కు కనెక్ట్ అయితే చాలు.. దాన్ని గుండెల్లో పెట్టుకుంటాడు.
By: A.N.Kumar | 1 Oct 2026 3:49 PM ISTవెండితెరపై ఒక ఆలోచన మెరిస్తే చాలు... 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప'ల రూపంలో సరిహద్దులు చెరిగిపోతాయి. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుడు బ్రహ్మరథం పడతాడు. కేరళలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరిగ్గా ఇదే పాయింట్‌ను ప్రస్తావించారు. “తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లగా లేనిది... తెలుగు రాజకీయ పార్టీ దేశవ్యాప్తంగా ఎందుకు విస్తరించకూడదు?” అన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. జాతీయ రాజకీయ విశ్లేషకుల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి.
వినడానికి ఈ ఆలోచన ఎంత ఆకర్షణీయంగా ఉందో... ఆచరణలో అంతటి క్లిష్టమైన సవాలును మోసుకొచ్చింది. ఎందుకంటే సినిమా ప్రపంచానికి, రాజకీయం చేసే మైదానానికి నడుమ కొండంత వ్యత్యాసం ఉంది.
సినిమా అంటే ఒక రెండున్నర గంటల మాయాజాలం. థియేటర్ చీకట్లో కూర్చున్న ప్రేక్షకుడు కథలోని ఎమోషన్‌కు కనెక్ట్ అయితే చాలు.. దాన్ని గుండెల్లో పెట్టుకుంటాడు. కానీ రాజకీయమనేది రెండున్నర గంటల వినోదం కాదు... అది కోట్ల మంది ప్రజల ఐదు సంవత్సరాల భవిష్యత్తు, వారి జీవిత పోరాటం..
ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి తెలంగాణ స్వీయ ఆత్మగౌరవ పోరాటమే ఊపిరిగా ఎదిగిన టీఆర్ఎస్... ఒక్కసారిగా బీఆర్ఎస్‌గా మారి ‘పాన్ ఇండియా’ జెండా ఎగరేయాలనుకొని చేసిన ప్రయోగం ఘోరంగా విఫలమై తొలి ప్రయత్నంలోనే ఓడిపోయింది. పెద్ద సాహసం ఫ్లాప్ అయ్యింది. కేవలం బ్రాండింగ్ మారిస్తేనో.. ఆకర్షణీయమైన నినాదాలు ఇస్తేనో రాజకీయాల్లో నెగ్గుకురావడం సాధ్యం కాదు. స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన, అక్కడి సామాజిక సమీకరణాలను అర్థం చేసుకునే ప్రాంతీయ నాయకత్వం, రాత్రింబవళ్లు ప్రజల్లో ఉండే బలమైన కేడర్ లేకపోతే ఏ జాతీయ జెండా అయినా నేలకొరగక తప్పదు.
తెలంగాణ ప్రజలతో ఉన్న భావోద్వేగ బంధం, మహారాష్ట్రనో లేదా మరే ఇతర రాష్ట్ర ప్రజలతోనో రాత్రికి రాత్రే ఏర్పడదు. సినిమాకు ఒక 'హీరో' ఉంటే సరిపోతుందేమో కానీ రాజకీయాల్లో ప్రతి రాష్ట్రానికీ ఒక ప్రత్యేకమైన కథ.. అక్కడ గెలిచే స్థానిక కథానాయకుడు వేరే ఉంటాడు.
అయితే కేటీఆర్ ఆశయాన్ని పూర్తిగా తప్పుపట్టలేం. తెలుగు నాయకత్వం దేశ రాజకీయాలను శాసించాలన్న తపన, తెలంగాణ సంక్షేమ నమూనాను దేశమంతటా విస్తరించాలన్న ఆలోచన గొప్పదే. కానీ సమస్య ఆ ఆలోచనలో లేదు... దాన్ని నేలపైకి తెచ్చిన విధానంలోనే ఉంది.
పాన్ ఇండియా సినిమా ఫార్ములాను రాజకీయాలకు ఆపాదించడం ఒక ఆసక్తికరమైన రాజకీయ ప్రయోగమే కావచ్చు. కానీ కేవలం ‘పాన్ ఇండియా’ అనే మెరుపు పదం ఒక పార్టీని జాతీయ శక్తిగా మార్చలేదు. ప్రజల నమ్మకం, బలమైన సంస్థాగత పునాది ఉన్నప్పుడే ఏ పార్టీ అయినా నిజమైన జాతీయ శక్తిగా ఎదుగుతుంది. సినిమా రీలు తిరిగినంత సులభంగా రాజకీయాల్లో గెలుపు చక్రం తిరగదనేదే ఈ ప్రయోగం నేర్పిన పాఠం..
