కేటీఆర్ ది కెప్టెన్...అమీ తుమీ తేల్చుడే !
గులాబీ బాస్ కేసీఅర్ కి ఇంకా సరైన ముహూర్తం రాలేదు. కేటీఆర్ అన్నట్లుగా సరైన టైం అయితే ఇది కాదేమో. కేసీఆర్ కరెక్ట్ టైం లోనే ఫీల్డ్ లోకి దిగుతారు అని ఈ మధ్యనే కేటీఆర్ చెప్పారు.
By: Satya P | 3 Oct 2025 7:00 AM ISTగులాబీ బాస్ కేసీఅర్ కి ఇంకా సరైన ముహూర్తం రాలేదు. కేటీఆర్ అన్నట్లుగా సరైన టైం అయితే ఇది కాదేమో. కేసీఆర్ కరెక్ట్ టైం లోనే ఫీల్డ్ లోకి దిగుతారు అని ఈ మధ్యనే కేటీఆర్ చెప్పారు. ఇదిలా ఉంటే ఇంతలో లోకల్ బాడీ ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఇది గులాబీ పార్టీకి గొప్ప అవకాశం. ఓడి రెండేళ్ళకు దగ్గర పడుతున్న సందర్భంలో సర్వ శక్తులూ ఒడ్డి గెలిస్తే మాత్రం గులాబీ జోరు మామూలుగా ఉండదు. ఒక విధంగా గోల్డెన్ ఆపర్చ్యునిటీ గా ఉంది. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన స్థానిక సమరంలో కేసీఆర్ అయితే రంగంలోకి దిగరని అంటున్నారు.
నిరూపించుకోవాల్సిన అవసరం :
తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. కోట్లాదిగా ప్రజలు ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ కి ఎంతో ముఖ్యమైనవి. అంతే కాదు విపక్షంలోని బీఆర్ఎస్ కి అంతే కీలకమైనవి. బీఆర్ఎస్ విషయానికి వస్తే వరసగా మూడవ సారి అధికారంలోకి వస్తామని ధీమాతో 2023లో ఎన్నికల గోదాలోకి దిగింది. కానీ చివరికి విపక్ష హోదా దక్కింది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది. ఈ మధ్యలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడలేదు. దాంతో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తన బలం కచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం అయితే బీఆర్ఎస్ కి ఉంది అని అంటున్నారు.
కేటీఅర్ తోనే అంతా :
అయితే ఈ ఎన్నికలను బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్ట గానే తీసుకున్నారు. కేసీఅర్ అవసరం లేకుండా అంతా తానై ముందుకు నడిపిస్తాను అని అంటున్నారు. ఆయన అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా అన్ని పూర్తిగా కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగుతాను అని అంటున్నారు. అంతే కాదు ఎన్నికల్లో విజయానికి తగిన వ్యూహాలను రూపొందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళ పాలనను ఎండగట్టాలని జనంలో కాంగ్రెస్ వైఫల్యాలను తీసుకుని వెళ్ళడం ద్వారా ఆ పార్టీకి ఎన్నికల్లో చుక్కలు చూపించాలని చూస్తున్నారు.
మెజారిటీ సీట్లే టార్గెట్ :
పోయిన ప్రతిష్టను పొందాలీ అంటే అత్యధిక స్థానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుచుకోవాలని బీఆర్ ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ పట్ల జనంలో విపరీతమైన వ్యతిరేకత ఉందని భావిస్తున్న కేటీఆర్ దానికి తగిన విధంగా జనం వద్దకు వెళ్లాలని చూస్తున్నారు. ఇక కేటీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే బాకీ కార్డు. రెండేళ్ళుగా పలు పధకాలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో జనాలకు చెప్పడమే దీని వెనక ఉద్దేశ్యం అంటున్నారు.
చెల్లెమ్మకు చెక్ :
ఇక తన సొంత చెల్లెలు, బీఆర్ఎస్ నుంచి వేరు పడి గులాబీ ముళ్ళను గుచ్చుతున్న కవితను కూడా ఈ ఎన్నికల్లో దెబ్బ తీయాలన్నది వ్యూహంగా ఉంది అని అంటున్నారు. బీఆర్ఎస్ లో క్షేత్ర స్థాయిలో పూర్తి బలం తమకే ఉందని చెప్పుకోవడానికి కూడా కేటీఅర్ పూర్తి స్థాయి అస్త్ర శస్త్రాలతో ఎన్నికల గోదాలోకి దిగిపోయారు అని అంటున్నారు. మొత్తానికి అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇటు చెల్లెమ్మకు చెక్ పెట్టే దిశగా ఆయన వ్యూహ రచన చేస్తున్నారు అని అంటున్నారు.
