వెయ్యి రోజుల్లో అధికారం మాదే.. లెక్కలు తేలుస్తాం!
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యా ఖ్యలు చేశారు.
By: Garuda Media | 8 Aug 2025 10:40 AM ISTతెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. వెయ్యి రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇది పెద్ద సమయం కాదన్నారు. కార్యకర్తలు, నాయకులు కలివిడిగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. అధికారంలోకి వచ్చాక.. అందరి లెక్కలు తేలుస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లలోనే ఎన్నికలు రానున్నాయని.. అప్పుడు తమదే విజయమని చెప్పారు.
తెలంగాణ సమాజం.. కేసీఆర్ ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూస్తోందన్నారు. దీనికి కారణం.. కేసీఆర్ పాలన ఓ స్వర్ణ యుగంగా ప్రజలు భావించడమేనని చెప్పారు. అన్ని వర్గాలు, రంగాల ప్రజలు సంతోషం గా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. కానీ.. ఇప్పుడు ప్రజల రక్తం పీలుస్తున్నారని, ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. రేవంత్ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని విమర్శించారు. కనీసం యూరియా కూడా అందక రైతులు పడిగాపులు పడుతున్నారని అన్నారు.
ఉన్నతాధికారులపై ఫైర్
ఈ సందర్భంగా కలెక్టర్లు, ఐఏఎస్ అదికారులపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలోనే రేషన్ కార్డులు ఇచ్చామని.. కానీ, ఇప్పుడు ఐఏఎస్ అధికారులు అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానిం చారు. ప్రభుత్వంతో మిలాఖత్ అయ్యారని అన్నారు. కానీ.. తమ ప్రభుత్వం వచ్చాక.. ఎవరి లెక్కలు వారికి సరిచేస్తామని తేల్చి చెప్పారు. ఐఏఎస్‌లు రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. ఎవరి పని వారు చేసుకుంటే బెటర్ అని హితవు పలికారు. అంతేకాదు.. ఒకవేళ రాజకీయాలు చేయాలని అనుకుంటే.. కండువా కప్పుకొని మాట్లాడాలని అన్నారు.
మా పథకాలు మానేశారు!
కేసీఆర్ హయాంలో ప్రజలకు ఇచ్చిన అన్ని పథకాలను ప్రస్తుత ప్రభుత్వంనిలిపి వేసిందని కేటీఆర్ వ్యా ఖ్యానించారు. దీనివల్ల పేదలు నష్టపోతున్నారని అన్నారు. రైతులకు ఇస్తామన్న సొమ్ములు కూడా ఇవ్వలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక ప్రభుత్వం రైతుబంధు నిలిపివేస్తుందని చెప్పారు. మనసు పెట్టి గతంలో కేసీఆర్ ప్రజలకు మేలు చేస్తే.. ఇప్పుడు తూతూ మంత్రంగా చేసి.. ఓట్ల రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ''మన పాలనలో చేసిన మంచిని ప్రచారం చేసుకోలేకపోయాం. అందుకే వెనుకబడ్డాం.'' అని కేటీఆర్ అనడం ఆసక్తిగా మారింది.
