రేవంత్ రెడ్డి కుర్చీని మడతపెట్టి..! కేటీఆర్ హాట్ కామెంట్స్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By: A.N.Kumar | 9 Nov 2025 9:00 PM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి, బీఆర్ఎస్ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కుర్చీ గుంజేందుకు కాంగ్రెస్ నేతలే సిద్ధం!
"రేవంత్ రెడ్డి మూడేళ్లు ఉంటాడో, మూడు నెలలు ఉంటాడో తెలీదు. ఢిల్లీలో కత్తులు నూరుతున్నారు. ఆయన కుర్చీని లాగేందుకు పక్కనే ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాల కాంగ్రెస్ ముఖ్యులు సిద్ధం అవుతున్నారు" అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని వ్యక్తి అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రజలను ప్రశ్నించారు. "ఆ కుర్చీని మీరే మడతపెట్టి.. తర్వాత ఏం చేయాలో తెలుసుగా అది చేయండి" అంటూ ఓటర్లకు పరోక్షంగా సందేశం పంపారు.
ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే తెలంగాణ భ్రష్టు పట్టింది!
కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వడం వల్లే రాష్ట్రం నాశనమైందని కేటీఆర్ దుయ్యబట్టారు. "ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ భ్రష్టుపట్టింది. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఆటో అన్నల ఆత్మహత్యలు, రియల్ ఎస్టేట్ నాశనం అయ్యింది.. గురుకులాలు ఆగమైపోయాయి. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న రాష్ట్రం చివరి స్థానానికి పడిపోయింది" అని విమర్శించారు.
'హైడ్రా' భూతం పేదల ఇళ్లు కూలగొడుతోంది
ప్రస్తుత పాలన 'ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం' అన్నట్లుగా తయారైందని కేటీఆర్ మండిపడ్డారు. "హైడ్రా భూతం పేదల ఇండ్లు కూలగొడుతోంది. పేదలను బయటకు గుంజుకొచ్చి.. ఇళ్లు కూలగొడుతున్నారు. బుక్స్ తీసుకుంటాం అని చిన్నారులు అడిగితే కూడా బయటకు లాగి కూలగొట్టారు." అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 'హైడ్రా' పేదలకు మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించిన కేటీఆర్... "మంత్రులు పొంగులేటి, వివేక్ ఇండ్లకు హైడ్రా వెళ్లదు. తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లదు. ఇది ఆషామాషీ పోటీ కాదు.. ఇక్కడ కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నిక" అని పేర్కొన్నారు. బుల్డోజర్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
420 హామీలు ఇచ్చి పథకాలు బంద్!
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసిందని కేటీఆర్ ఆరోపించారు. "కేసీఆర్ కిట్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని కూడా బంద్ చేశారు. రంజాన్ తోఫా లేదు.. బతుకమ్మ చీర లేదు.. క్రిస్మస్ గిఫ్ట్ లేదు. రైతుబంధు లేదు.. రైతు బీమా లేదు.. ఇలా అన్ని పథకాలను బంద్ పెట్టారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు" అని దుయ్యబట్టారు.ఫ్రీ బస్ పథకాన్ని ప్రస్తావిస్తూ... "ఏమైనా అంటే ఫ్రీ బస్ అంటారు. భార్యకు ఫ్రీ బస్.. భర్తకు డబుల్ రేటు.. ఇదేలా ఫ్రీ అవుతుంది?" అని ప్రశ్నించారు. అలాగే, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ పథకాన్ని కూడా ఎత్తేయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు!
"నిష్పక్షపాతంగా కొట్లాడితే ఓడిపోవడం ఖాయమని రేవంత్‌కు అర్థమైంది. అందుకే దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు" అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలన బాగుండెనా, రెండేళ్ల రేవంత్ పాలన బాగుందో మీరే తీర్పు చెప్పాలని ప్రజలకు సూచించారు. "4 లక్షల మంది ఓటర్ల వైపు 4 కోట్ల మంది చూస్తున్నారు. పదేళ్ల వికాసానికి.. రెండేళ్ల సంక్షోభానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి" అని ప్రకటించారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించి, కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ రావాలంటే.. జూబ్లీహిల్స్ నుంచే ఈ జైత్రయాత్ర స్టార్ట్ కావాలి అని ఆయన ఆకాంక్షించారు.
