బాబుని పొగుడుతున్న కేటీఆర్...వ్యూహాత్మకమా ?
చేసిన తప్పులను సరిదిద్దుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
By: Satya P | 13 April 2026 9:33 AM ISTచేసిన తప్పులను సరిదిద్దుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. వాటిని సరిచేసుకోవడం తమ బాధ్యత అన్నారు. ఇవన్నీ మంచి విషయాలే. ఎందుకంటే ఎవరైనా ముందుకు వెళ్ళాలీ అంటే ఆత్మావలోకనం చేసుకోవాల్సిందే. ఇక కేటీఆర్ సైతం అదే అంటున్నారు. తాము 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ చేసిన పొరపాట్ల వల్ల ప్రజలకు క్యాడర్ కి దూరం పెరిగింది అని అన్నారు. దీని మీద అన్ని విధాలుగా అధ్యయనం చేశామని కూడా చెప్పారు. ఇక మీదట ఆ పొరపాట్లు లేకుండా చూసుకుంటామని చెప్పారు.
గొప్ప సీఎంలు అంటూ :
అదే సమయంలో చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రులు అంటూ ఆయన ఎన్టీఆర్ వైఎస్సార్ చంద్రబాబు కేసీఅర్ ల పేర్లు ప్రస్తావించారు వీరు అలా జనంలో నిలిచారు అని కొనియాడారు. దీంతో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. ఇంతలో ఎంత మార్పు అన్నట్లుగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికి సరిగ్గా మూడేళ్ళ క్రితం 2023లో చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే తెలంగాణాలో ఉద్యమాలు ఎందుకు అని ప్రశ్నించిన వారు కేటీఆర్ అని గుర్తు చేసుకుంటున్నారు. ఇపుడు చరిత్రలో బాబుకు గొప్ప ముఖ్యమంత్రిగా స్థానం ఇచ్చేశారు అని అంటున్నారు. అంతే కాదు టీడీపీకి మంచి నాయకత్వం ఉంది అని క్యాడర్ తో వారు మమేకం అవుతారు అని కూడా కేటీఆర్ చెప్పడం మరో విశేషం.
ఎత్తుగడతోనేనా :
తెలంగాణాలో ఆంధ్రా వాళ్ళ పెత్తనం ఏమిటి అని ఒకనాడు ప్రశ్నించిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి పార్టీ నోటి వెంట చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రులు అంటూ ముగ్గురు సీమాంధ్ర సీఎంల పేర్లు ప్రస్తావించడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. తెలంగాణాలో ఏపీకి చెందిన వారు అధికంగా ఉంటారు, అనేక నియోజకవర్గాలలో వారి ప్రభావం ఉంటుంది. ప్రత్యేకించి మీడియా బలం కూడా ఆ వైపు ఎక్కువగా ఉంటుంది. ఇక 2023 ఎన్నికల్లో ఇవన్నీ తమకు వ్యతిరేకంగా పనిచేశాయి అన్నది బీఆర్ఎస్ ఆలోచన కావచ్చు అని అంటున్నారు. అందుకే కేటీఆర్ నోటి వెంట బాబు గొప్ప సీఎం అన్న మాట వచ్చింది అని అంటున్నారు.
వైసీపీతో దోస్తీ :
ఇక బీఆర్ఎస్ మీద మరో ఆరోపణ ఉంది. వైసీపీతో ఏపీలో దోస్తీ చేస్తూ టీడీపీని దెబ్బ తీయడానికి 2014, 2019 ఎన్నికల్లో చూసిందని, ఇక 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే వైఎస్ జగన్ మరోసారి అని కూడా బీఆర్ఎస్ అగ్ర నేతలు చెప్పుకొచ్చారు. అంతే కాదు జగన్ ఎందుకు ఓడారు అని కూడా ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. కానీ ఇపుడు చూస్తే మాత్రం బాబులో మంచిని చూస్తున్నారు అని కామెంట్స్ వస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా ఏపీలో వైసీపీతో దోస్తీ కటీఫ్ అయినట్లేఅ అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ప్రేమ ఇంకెంత పెరుగుతుందో :
ఈ మధ్యనే అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు బీఆర్ స్ రాజ్యసభలో అనుకూలంగా ఓటేసింది. ఆ సమయంలో తెలంగాణా సమస్యలను ప్రస్తావించి మెలిక పెడతారు అని ప్రచారం సాగినా అలాంటిది ఏదీ లేకుండానే అవుట్ రేట్ గా మద్దతు ఇచ్చింది. ఇపుడు టీడీపీని పొగడడం అంటే తెలంగాణాలో బలమైన సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకోవడం కోసమే అని అంటున్నారు. ఎటూ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి ఆ సామాజిక వర్గం మద్దతు దక్కుతోంది, దాంతో జగన్ తో దోస్తీ వల్ల ఆ ఓట్లు తమ వైపు ఎంతవరకూ పడతాయి అన్న ఆలోచనలు విశ్లేషణలు ఉండవచ్చు అని అందుకే ఈ విధంగా కొత్త వ్యూహం తీసుకుంది అని అంటున్నారు. చూడాలి మరి ఫ్యూచర్ లో చంద్రబాబు మీద బీఆర్ఎస్ నేతల ప్రేమ ఇంకెంత పెరుగుతుందో.
