Begin typing your search above and press return to search.

రెండు డోసుల విషం ఇచ్చినా మ‌ర‌ణించ‌ని ఖైదీ.. అధికారుల‌పై గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్!

బుధవారం రాత్రి కోర్టు ధర్మాసనానికి అందించిన వివరాల ప్రకారం.. అధికారులు పైక్‌కు పెంటోబార్బిటాల్ అనే ప్రాణాంతక మందును రెండు డోసులుగా అందజేశారు.

By:  Sivaji Kontham   |   2 Oct 2026 3:12 PM IST
రెండు డోసుల విషం ఇచ్చినా మ‌ర‌ణించ‌ని ఖైదీ.. అధికారుల‌పై గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్!
X

టెన్నెసీ రాష్ట్రంలో క్రిస్టా గెయిల్ పైక్ (50) అనే దోషికి 1995 నాటి హత్య కేసుకు సంబంధించి విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. రెండు డోసుల ప్రాణాంతక మందు(విషం)ను ఇచ్చినా ఆమె చనిపోలేదని.. మరణశిక్ష నిపుణులు ఇది చరిత్రలోనే అపూర్వమైన .. అసాధారణమైన వైఫల్యమని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ఉరిశాల నుంచి ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే పైక్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు.

బుధవారం ఉదయం 10 గంటలకు పైక్‌కు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఆమె 18 ఏళ్ల వయసులో ఈ హత్యకు పాల్పడింది. ఒకవేళ ఇది అమలైతే గత 200 సంవత్సరాలలో టెన్నెసీలో ఉరిశిక్షకు గురైన మొదటి మహిళగా ఆమె రికార్డులోకి ఎక్కి ఉండేది. అయితే ఉరిశిక్ష ప్రారంభం కావడానికి గంట ముందు అప్పీల్ కోర్టు దానిని నిలిపివేసినా గంటల వ్యవధిలోనే అమెరికా సుప్రీంకోర్టు ఆ స్టేను ఎత్తివేసింది.

బుధవారం రాత్రి కోర్టు ధర్మాసనానికి అందించిన వివరాల ప్రకారం.. అధికారులు పైక్‌కు పెంటోబార్బిటాల్ అనే ప్రాణాంతక మందును రెండు డోసులుగా అందజేశారు. మీడియా సాక్షుల వివరాల ప్రకారం.. ఉరిశిక్ష గదిలో కర్టెన్లు తెరిచినప్పుడు తాను ప్రేమతోనే ఈ లోకాన్ని విడిచివెళ్తున్నానని.. తాను ప్రశాంతంగా ఉన్నానని పైక్ పేర్కొన్నారు. కానీ ఆమె స్పృహలోనే ఉండి..ఒక దశలో తల పైకెత్తి తన చేయి అలా ఎందుకు అనిపిస్తుందని అధికారులను ప్రశ్నించింది. ఆ తర్వాత రాత్రి 8:53 గంటలకు మైక్ కట్ చేసే వరకు తెర వెనుక ఆమె గురక పెడుతున్న శబ్దాలు వినిపించాయి.

ఈ ఊహించని ఘటనపై టెన్నెసీ గవర్నర్ బిల్ లీ తీవ్రంగా స్పందించారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి సమగ్రమైన మూడో పక్షం ద్వారా విచారణకు ఆదేశించామని ఆయన తెలిపారు. చట్టపరమైన శిక్షను అమలు చేయడం అత్యంత బాధ్యతాయుతమైన విషయమని.. అది రాజ్యాంగబద్ధంగా, సమర్థవంతంగా జరగాలని పేర్కొంటూ ఈ ఏడాది మిగిలి ఉన్న మరొక ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు అటార్నీ జనరల్ కార్యాలయం ఆమోదించిన నిబంధనల ప్రకారమే తాము అన్ని దశలను అనుసరించినట్లు టెన్నెసీ కరెక్షన్ విభాగం తెలిపింది.

ఉరిశిక్ష విఫలమైన తర్వాత పైక్ న్యాయవాదులు టెన్నెసీ సుప్రీంకోర్టుతో పాటు సిక్స్త్ సర్క్యూట్ కోర్టు.. జిల్లా కోర్టుల్లో అత్యవసర పిటిషన్లు దాఖలు చేశారు. ఆమెను అనవసరమైన యాతనకు గురిచేశారని..క్రూరమైన.. అసాధారణమైన శిక్షల నుండి రక్షణ పొందే ఆమె ప్రాథమిక హక్కును ఇది ఉల్లంఘించేలా ఉందని వారు తమ వాదనలో పేర్కొన్నారు.