Begin typing your search above and press return to search.

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

పోలీస్ అధికారులు కరెక్ట్ గా ఉంటే శాంతి భద్రతలు సక్రమంగా ఉంటాయి. ఇపుడు ఎందుకు ఈ ప్రస్థావన అంటే కర్నూలు రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కోయ ప్రవీణ్ కోసమే.

By:  Satya P   |   3 Nov 2026 10:30 PM IST
కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !
X

పోలీస్ అధికారులు కరెక్ట్ గా ఉంటే శాంతి భద్రతలు సక్రమంగా ఉంటాయి. ఇపుడు ఎందుకు ఈ ప్రస్థావన అంటే కర్నూలు రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కోయ ప్రవీణ్ కోసమే. ఆయన విధి నిర్వహణలో రాజీలేని ధోరణిని ప్రదర్శించడం ఇప్పుడు రాయలసీమ మొత్తం చర్చ సాగుతోంది. ఆయన కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడంతో పాటు గట్టి పట్టుదల కలిగిన అధికారిగా ఉండడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్రాక్షన్ నేపథ్యం ఉన్న ప్రాంతాలలో సైతం లా అండ్ ఆర్డర్ పెద్దగా బ్రేక్ కాలేదని అంటున్నారు. అంతే కాదు వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అలాగే వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట అయిన పులివెందులలో కూడా ఇదే తీరున ఆయన దృఢ చిత్తంతో వ్యవహరించారు. ఫలితంగానే అక్కడ ప్రజా తీర్పు కచ్చితంగా వచ్చిందని అంటున్నారు.

పులివెందులలో గట్టిగా :

ఇక పులివెందులలో వైసీపీ ఎపుడూ గెలుస్తూ వస్తుంది. అలాగే గతంలో కాంగ్రెస్ అయినా తర్వాత వైసీపీ అయినా వైఎస్సార్ కుటుంబీకులే పులివెందుల పీఠం మీద కూర్చుంటారు. 2005లో మునిసిపాలిటీగా అప్ గ్రేడ్ అయిన పులివెందులలో ఈసారి పకడ్బందీ ఏర్పాట్ల మధ్య మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయని అంటున్నారు. దాంతో ఈసారి ఎలా ఎన్నికలు జరుగుతాయన్నది అందరిలో ఉన్నా కూడా కోయ ప్రవీణ్ అక్కడ ఏమి చేయాలో అలా చేసి చివరి దాకా లా అండ్ ఆర్డర్ బ్రేక్ కాకుండా చూసుకున్నారు. దాని ఫలితమే అక్కడ కూటమి అభ్యర్ధులు తొలిసారి గెలిచి జెండా ఎగరవేశారు. పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను జరిపించడంలో కోయ ప్రవీణ్ పూర్తి స్థాయిలో కీలక పాత్ర పోషించారు అని అంటున్నారు.

మాజీ సీఎం అయినా :

ఇక మాజీ సీఎం హోదాలో జగన్ పులివెందులకు వచ్చినపుడు కూడా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూశారు. జగన్ తన ఓటు తాను వేసుకుని వెళ్ళిపోవాలని పర్యటనలకు అవకాశం లేదని ముందే గట్టిగా చెప్పిన కోయ ప్రవీణ్ అక్కడ శాంతి భద్రతలు అతి ముఖ్యమని స్పష్టం చేయగలిగారు. ఇక ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రంగా చెప్పుకునే పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడూ వార్ వన్ సైడ్ అన్నట్లుగానే సాగుతాయి. కానీ ఈసారి పూర్తిగా ఎన్నికల్లో ఒక పారదర్శకత కనిపించింది అంటే కోయ ప్రవీణ్ పెట్టిన ప్రత్యేక శ్రద్ధ అని అంటున్నారు. దాంతో వైసీపీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అవి వీగిపోయాయని అంటున్నారు.

కవాతుతో జనంలోకి :

ఇక ఎన్నికలకు ముందు భారీ కవాతుని పులివెందులలో నిర్వహించడం ద్వారా ప్రజలు స్వేచ్చగా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అన్న సందేశాన్ని కోయ ప్రవీణ్ పంపించారు అని అంటున్నారు. అలాగే జగన్ ఓటు అయినా సగటు జనం ఓటు అయినా తనకు ఒక్కటే అన్న సందేశం కూడా పంపించారు అని అంటున్నారు. జగన్ పులివెందులకు వచ్చి కొన్ని గంటల పాటు ఉన్నా ఆయన ఆర్వో ఆఫీస్ ముందు పార్టీ నేతలతో ఆందోళనలు నిర్వహించినా ఒక దశలో అశాంతికి ఈ ఘటనలు దారి తీస్తాయన్న సంకేతాలు వచ్చినా కోయ ప్రవీణ్ ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకోగలిగారు. ఆ విధంగా ఆయన కరెక్ట్ డైరెక్షన్ తోనే పోలీస్ యంత్రాంగం పనిచేసింది అని అంటున్నారు.

జగన్ హయాంలో అలా :

ఇక కోయ ప్రవీణ్ మీద వైసీపీ మొదటి నుంచి అనుమానం చూపులతోనే వ్యవహరిస్తూ వచ్చిందని చెబుతారు. ఈయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనను వైసీపీ ప్రభుత్వ హయాంలో లూప్ లైన్ లో ఉంచింది అని అంటారు. కీలక పదవులలో కాకుండా రైల్వే పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ ఆక్టోపస్ గ్రేహౌండ్స్ వంటి పదవులలో మాత్రమే నియమించారు. అయితే కోయ ప్రవీణ్ విశాఖపట్నం జిల్లా ఎస్పీగా విజయవాడ నగర శాంతిభద్రతలు విభాగం డీసీపీగా ప్రకాశం జిల్లా ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కోయ ప్రవీణ్‌ను కర్నూలు రేంజ్ డీఐజీగా నియమించడంతో ఆయనను వైసీపీ టార్గెట్ చేస్తూనే ఉంది. అయితే ఈ అధికారి మాత్రం విధి నిర్వహణలో ఎక్కడా తగ్గేది లేదని మరోసారి చాటి చెప్పారని అంటున్నారు. దీంతోనే పులివెందుల లాంటి చోట భిన్నమైన ఫలితాలు వచ్చాయని. లా అండ్ ఆర్డర్ బ్రేక్ కాలేదని గుర్తు చేస్తున్నారు.