ఫ్రమ్ వైసీపీ టు టీడీపీ.. కోవూరు సమ్ థింగ్ స్పెషల్!
ఏపీ పాలిటిక్స్ లో కోవూరు నియోజకవర్గంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనదైన రాజకీయంతో దూసుకుపోతున్నారని టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Political Desk | 2 Nov 2025 6:00 PM ISTఏపీ పాలిటిక్స్ లో కోవూరు నియోజకవర్గంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనదైన రాజకీయంతో దూసుకుపోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రతిపక్షం వైసీపీ ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ స్వయంకృతంతోపాటు ఎమ్మెల్యే వేమిరెడ్డి వ్యవహారశైలి కోవూరు రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అధికార టీడీపీలో చాలా నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయి. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ గ్రూప్ వార్ పై సీరియస్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవూరు రాజకీయం కాస్త స్పెషల్ గా ఉందని విశ్లేషిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ చాలా నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలను ఎదుర్కొంటోంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో ప్రధానంగా మిత్రపక్షాలతో సర్దుబాటు ఒక సమస్య అయితే, ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేలైన నేతల ఒంటెద్దు పోకడలు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు అప్పటివరకు పార్టీలో ఉన్నవారిని తొక్కేసే విధంగా నడుచుకోవడం పలు చోట్ల వివాదాలకు కారణం అవుతోంది. ఇందుకు నెల్లూరు జిల్లాలోనే ఉన్న కావలి నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా చూపుతున్నారు. కానీ, అదే జిల్లాలో ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు టీడీపీ అధిష్టానానికి ఒక ఓదార్పుగా చెబుతున్నారు.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఈ మహిళా నాయకురాలు ‘అమ్మ’లా అందరికీ దగ్గర అవుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు తన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. దీంతో ప్రతిపక్షం కూడా చెల్లాచెదురైపోతోందని అంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటున్నారు.
సొంత డబ్బుతో సేవ కార్యక్రమాలు చేస్తూ, అందరినీ దగ్గర చేసుకుంటున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలను ఎవరూ హర్షించడం లేదని, అప్పటి నుంచి నల్లపురెడ్డితో కలిసి తిరిగేందుకు వైసీపీ నేతలు కూడా వెనక్కి తగ్గుతున్నారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేత అయిన నల్లపురెడ్డి సహనం కోల్పోయి ప్రవర్తించడం, ఆ తర్వాత పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల కోవూరులో టీడీపీ మరింత బలపడిన సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోతున్న ప్రశాంతిరెడ్డి.. ప్రతిపక్షంలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిని ఒంటరిని చేసేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.
కోవూరు నియోజకవర్గం ఒకప్పుడు నల్లపురెడ్డి కుటుంబం కంచుకోట. 1983లో ఈ నియోజకవర్గం నుంచి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అవడంతోపాటు మంత్రిగానూ సేవలు అందించారు. ఆయన తదనంతరం కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఈయన కూడా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983 నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 11 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు నల్లపురెడ్డి కుటుంబం గెలిచింది. రెండు సార్లు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఇక గత ఎన్నికల్లో ప్రశాంతిరెడ్డి గెలిచారు. అప్పటినుంచి ప్రత్యేక పంథాలో ఆమె దూసుకుపోతుండటం కోవూరు రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేస్తోందని అంటున్నారు. వైసీపీకి, నల్లపురెడ్డి కుటుంబానికి ఒకేసారి చెక్ చెప్పేలా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పావులు కదపుతుండగా, ఆమెను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకుంటారనేది చూడాల్సివుందని అంటున్నారు.
