Begin typing your search above and press return to search.

కొవ్వూరు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు.. రెండు పార్టీల అభ్యర్థుల ఎంపికలోనూ గందరగోళం

పార్టీ నేతలు అంతా ఒకరిని అనుకుంటే, అధిష్టానం వేరొకరికి అవకాశం ఇవ్వడం పట్ల కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధిష్టానం నిర్ణయాన్ని నిరసిస్తూ పార్టీ స్థానిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

By:  Tupaki Political Desk   |   18 Oct 2026 11:22 AM IST
కొవ్వూరు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు.. రెండు పార్టీల అభ్యర్థుల ఎంపికలోనూ గందరగోళం
X

గోదావరి జిల్లాల్లోని ప్రధానమైన కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రధాన పార్టీలు రెండింటి లోనూ గందరగోళమే రాజ్యమేలుతోంది. అధికార టీడీపీ కూటమిలో స్థానిక నేతలు అంతా ఒక అభ్యర్థిని పోటీకి దింపగా, అధిష్టానం అనూహ్యంగా వేరొకరికి పేరును ఖరారు చేసింది. స్థానిక నాయకులు అంతా తాము అనుకున్న అభ్యర్థితో నామినేషన్ వేయించగా, పార్టీ అధిష్టానం విడుదల చేసిన జాబితాలో వేరే నేత పేరు చూసి కంగుతిన్నారు. అటు విపక్షం వైసీపీలోనూ ఇంచుమించు ఇటువంటి పరిస్థితే నెలకొంది. పార్టీ తరఫున చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించిన నేత పోటీకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం కంగారు పడుతోందని అంటున్నారు.

షాక్ ఇచ్చిన టీడీపీ అధిష్టానం

కొవ్వూరు టీడీపీలో అధిష్టానం నిర్ణయం కార్యకర్తలను షాక్ కు గురిచేసింది. ఈ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతోపాటు పార్టీ సీనియర్ నేత మద్దిపట్ల శివరామకృష్ణ మద్దతుతో పార్టీ అభ్యర్థిగా కంతామణి విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. వందలాది మంది పార్టీ కార్యకర్తల సమక్షంలో అట్టహాసంగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఇంతలోనే రెండో విడత జాబితా విడుదల చేసిన టీడీపీ అధిష్టానం కొవ్వూరు సీటును జొన్నలగడ్డ రాధారాణికి ఖరారు చేసింది. ఈ పరిణామంతో పార్టీ కార్యకర్తలు నేతలు కంగుతిన్నారు. తాము విజయలక్ష్మి పేరునే అధిష్టానానికి సూచించగా, అధిష్టానం రాధారాణి పేరును ఎలా ఎంపిక చేసిందో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, పార్టీ నేత శివరామకృష్ణ చెబుతున్నారు.

నిర్ణయం మారుతుందా?

పార్టీ నేతలు అంతా ఒకరిని అనుకుంటే, అధిష్టానం వేరొకరికి అవకాశం ఇవ్వడం పట్ల కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధిష్టానం నిర్ణయాన్ని నిరసిస్తూ పార్టీ స్థానిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తమ నేత కంతమణి విజయలక్ష్మికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, స్థానిక నాయకుల అభీష్టానికి భిన్నంగా అధిష్టానం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నల గడ్డ రాధారాణికి సీటు ఎలా కేటాయించిందో అర్థం కావడం లేదని కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. స్థానిక నేతలు ఎవరో రహస్యంగా సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. కార్యకర్తల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అధిష్టానం నిర్ణయం మార్చుకుంటుందా? లేదా? అనేది చూడాల్సివుందని అంటున్నారు.

వైసీపీ నుంచి పోటీకి విముఖత

ఇక విపక్షం వైసీపీలోనూ పరిస్థితులు గందరగోళంగానే ఉన్నాయి. ఇక్కడ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన మన్నె పద్మ పోటీకి విముఖతగా ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ తన పేరు ప్రకటించిన తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. దీంతో పార్టీ నేతలు, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తలారి వెంకటరావు తదితరులు ఆమెను నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. పద్మ తండ్రి స్థానికంగా మంచి పట్టున్న నేతగా చెబుతున్నారు. ఐదుసార్లు మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఎమ్మెల్సీగానూ పనిచేశారు. దీంతో ఆయన కుమార్తెను వైసీపీ ఎంపిక చేసింది. అయితే కూటమి పార్టీలు బలంగా ఉన్న నేపథ్యంలో విజయంపై నమ్మకం లేక పద్మ తప్పుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి కొవ్వూరులో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో వైసీపీ ఎవరిని రంగంలోకి దింపుతుందో చూడాల్సివుందని అంటున్నారు.