Begin typing your search above and press return to search.

జెన్ Z రాజకీయాలు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి వినూత్న ప్రయోగం!

జెన్ జీ యువత అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోవాలని నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ణయించారు.

By:  Tupaki Political Desk   |   25 Aug 2026 3:30 PM IST
జెన్ Z రాజకీయాలు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి వినూత్న ప్రయోగం!
X

జెన్ జీ యువత అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోవాలని నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ణయించారు. 51 రోజుల్లో 55 సమావేశాల ద్వారా మొత్తం 20 వేల మంది యువతతో సమావేశం కానున్నట్లు కోటంరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉండే యువతకు దగ్గరవ్వాలనే ప్రయత్నం ద్వారా కోటంరెడ్డి తన నియోజకవర్గంలో రాజకీయంగా పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయనకు ప్రయోజనం కల్పించడమే కాకుండా పార్టీకి మేలు చేసేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను మినహాయిస్తే మిగిలిన ఎమ్మెల్యేలు అందరికంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వినూత్న కార్యక్రమాలు చేపడతూ తన ప్రత్యేకత చాటుకుంటుంటారని పరిశీలకులు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి పనిచేస్తున్న కోటంరెడ్డికి నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉంది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన 2019లో రెండోసారి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే మధ్యలో వైసీపీ నాయకత్వంతో విభేదించి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే టీడీపీ రాజకీయాలకు పూర్తిగా కొత్త అయినప్పటికీ విభిన్న తరహాలో పనిచేస్తూ టీడీపీ హైకమాండ్ వద్ద మార్కులు సంపాదించారని అంటున్నారు.

జెన్ జీ యువతతో మాటామంతి నిర్వహించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి తాజాగా చేస్తున్న ప్రయోగంపై సానుకూల స్పందనలు వస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం దేశ యువత చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న క్రమంలో ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలో 20 వేల మందితో ముఖాముఖి మాట్లాడాలని నిర్ణయించడం ఒక విధంగా పెద్ద సాహసమే అంటున్నారు. 20 వేల మంది యువతతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ఒక్కటే కాకుండా, భవిష్యత్తులో అందుకు తగ్గట్లు నడుచుకోవాల్సివుంటుందని అంటున్నారు. ఇదే సమయంలో యువత ఆలోచనలకు తగ్గట్టు తాము నడుచుకుంటామని నమ్మకం కల్పించే ప్రయత్నం కూడా రాజకీయంగా మేలు చేస్తుందని అంటున్నారు.

ఇప్పటికే టీడీపీ అధిష్టానం తమ ఎమ్మెల్యేలు, కేడర్ ను ఇంటింటికి పంపుతోంది. ఇలాంటి సమయంలో పార్టీ చెప్పిన కార్యక్రమం చేస్తూనే సొంతంగా జెన్ జీ యువతతో మాటమంతీ నిర్వహించాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది. దీనివల్ల కొత్తతరం ఓటర్లకు ఆయన పరిచయం అవ్వడమే కాకుండా, పార్టీ కార్యక్రమాలకు ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇతర ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ కేడర్ కూడా అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విస్తృతంగా పెట్టుబడులు వస్తున్నాయని, ఈ విషయమై లాభపడే జెన్ జీ యువతకు అవగాహన ఉందో లేదో కూడా కోటంరెడ్డి కార్యక్రమం ద్వారా స్పష్టమవుతోందని అంటున్నారు. కోటంరెడ్డి కార్యక్రమం ద్వారా వచ్చే ఫలితాలను విశ్లేషించి రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించాలని టీడీపీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తోందని అంటున్నారు.