Begin typing your search above and press return to search.

ఏం కోటంరెడ్డి.. ఏంటీ దూకుడు.. !

కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి. ఈ పేరుకు పెద్ద‌గా పరిచయం అవ‌స‌రం లేదు. పేరుకు నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే అయినా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న పేరు అంద‌రికీ ప‌రిచ‌య‌మే.

By:  Garuda Media   |   25 Jan 2026 5:00 AM IST
ఏం కోటంరెడ్డి.. ఏంటీ దూకుడు.. !
X

కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి. ఈ పేరుకు పెద్ద‌గా పరిచయం అవ‌స‌రం లేదు. పేరుకు నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే అయినా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న పేరు అంద‌రికీ ప‌రిచ‌య‌మే. ఎమ్మెల్యేల్లో చాలా డిఫ‌రెంట్‌గా ఉండే కోటంరెడ్డి.. వైసీపీ విధానాలు న‌చ్చ‌క 2024 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోచేరారు. అయితే.. కేవ‌లం పార్టీ మార్పుతోనే ఆయ‌న హైలెట్ కాలేదు. దీనికి ముందు.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు చేసిన న్యాయ‌స్థానం - దేవ‌స్థానం పాద‌యాత్ర‌కు వైసీపీలో ఉండి కూడా మ‌ద్దతు తెలిపారు.

అంతేకాదు.. అమ‌రావ‌తిపై వైసీపీ నాయ‌కులు నోరు చేసుకుంటే.. కోటంరెడ్డి మాత్రం.. మౌనంగా ఉన్నారు. ''రైతుల ఆవేద‌నను మ‌నం అర్థం చేసుకోవాలి.. స‌మ‌స్యలు తీర్చాలి. ఏదైనా త‌ప్పులు జ‌రిగి ఉంటే.. కేసు లు పెట్టండి..'' అని నిర్మొహ‌మాటంగా జ‌గ‌న్‌కు సూచించారు. ఫ‌లితంగా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అనుకున్నా.. చివ‌రి నిముషంలో కోల్పోయారు. ఇక‌, ఆ త‌ర్వాత నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల స‌మ‌స్యల పైనా ఆయన స్పందిస్తున్నారు.

ఇలా..త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న కోటంరెడ్డి.. టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నాక మ రింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి పెద్ద గా నిధులు ఇవ్వ‌లేదు. కానీ, ఇప్పుడు నిధులు ఇస్తున్నారు. ఈ నిధుల‌తో పాటు.. స్వ‌యంగా ఎన్నారైల నుంచి కూడా కొంత నిధులు సేక‌రించి నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు ప‌నులు చేప‌ట్టారు.

ఇక‌, తాజాగా ఒకేసారి 240 ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు. నారా లోకేష్ సౌజ‌న్యం, స‌హ‌కారంతో 27 కోట్ల రూపా యల‌ను స‌మీక‌రించిన కోటంరెడ్డి.. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేప‌ట్టారు. సుదీర్ఘ‌కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్టారు. గ‌తంలోనూ ర‌హ‌దారులు, మురుగు కాల్వ‌ల నిర్మాణంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన కోటంరెడ్డి ఇప్పుడు మారు మూల ప్రాంతాల్లో అభివృద్ధిని భుజాన వేసుకున్నారు. మ‌రోవైపు ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డంలో ముందున్నారు.