మున్సిపల్ సిత్రం.. ఉదయం బీఆర్ఎస్.. రాత్రికి కాంగ్రెస్ పార్టీలోకి!
ఎన్నికల వేళ సిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు తెర లేవటం తెలిసిందే.
By: Garuda Media | 30 Jan 2026 9:43 AM ISTఎన్నికల వేళ సిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు తెర లేవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాల్లో పలు సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కౌన్సిలర్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఒక నాయకుడు.. తనకు టికెట్ దక్కదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ లోకి చేరటం.. రాత్రి అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీలోకి మారి టికెట్ పొందిన వైనం ఆసక్తికరంగా మారింది. జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. అసలేం జరిగిందంటే..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఎనిమిదో వార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయాలని కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్న తోట గంగాధర్ రెడ్డికి.. తనకు పోటీగా మరొకరు రంగంలోకి దిగినట్లుగా గుర్తించారు. తాను ఎంతగా ప్రయత్నిస్తున్నా టికెట్ దక్కని పరిస్థితి ఏర్పడటంతో.. ఆయన బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ తరఫు పోటీ చేయాలని భావించారు.
ఈ సమాచారాన్ని అందుకున్న బీఆర్ఎస్ వర్గాలు ఆలస్యం చేయకుండా సంప్రదింపులు జరిపారు. అనంతరం గురువారం ఉదయం కోరుట్లలోని గంగాధర్ ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆయనతో పాటు ఆయన మద్దతుదారుల మెడలో గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు.. రాత్రి వేళలో గంగాధర్ ను మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పిలిపించి.. తొమ్మిదో వార్డు అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి జువ్వాడి నర్సింగరావు ఆయనకు కండువా కప్పి తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. టికెట్ కోసం ఎంత సింఫుల్ గా కండువా మార్చేశారే అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తున్నారు. విపక్షంలో ఉన్న బీఆర్ఎస్.. మున్సిపల్ వార్డు అభ్యర్థి ఇంటికి పార్టీ ఎమ్మెల్యే వెళ్లి మరీ కండువా కప్పి టికెట్ ఫైనల్ చేస్తే.. అధికార పార్టీ మాత్రం పార్టీ ఆఫీసుకు పిలిపించి.. టికెట్ ఇచ్చి కండువా కప్పిన వైనం చూస్తే.. అధికార పార్టీ అధికారమే వేరన్న భావన కలుగక మానదు.
