కూటమిని కలుపుకొని పోతే.. కూనదే హవా!
కూన రవి కుమార్. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. ఆయన పేరు ఇటీవల కాలంలో జోరుగానే వినిపిస్తోంది.
By: Garuda Media | 13 Jun 2026 8:00 PM ISTకూన రవి కుమార్. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. ఆయన పేరు ఇటీవల కాలంలో జోరుగానే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న టీడీపీ సీనియర్ నేతగా.. ఆయన మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నించారు. కానీ, దక్కలేదు. దీంతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)లో చోటు కల్పించారు. దీంతో పాటు శ్రీకాకుళం జిల్లా క్రీడా రంగంలోనూ కీలక పోస్టు ఇచ్చారు. ఇక, రెండేళ్ల పాలనలో ఎమ్మెల్యేగా ఆయన తనదైన ముద్ర వేశారనే చెప్పాలి.
నియోజకవర్గంలో అందుబాటులో ఉండే నాయకుడిగా కూన పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. వైసీపీపై విమర్శలు చేయడంలోనూ.. పార్టీ వర్గాలను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తూ.. ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోతున్నారు. అయితే.. ఇదంతా.. ఆయనకు వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్లాన్‌గా కొందరు చెబుతుంటే.. కాదు.. పోటీ పెరుగుతున్న దరిమిలా జాగ్రత్త పడుతున్నారని మరికొందరు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. కూన రవి కుమార్... యువతను ఎక్కువగా ఆకర్షించేలా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని చిరంజీవి నాగ్ ఆముదాల వలసనుంచి పోటీ చేస్తారని తెలియడంతో ముందుగా నే అలెర్ట్ అవుతున్నారని సమాచారం. ఇది కూడా ఒకందుకు మంచిదే. అయితే.. లేనిదల్లా.. కూటమిలో సఖ్యత. కూన ఇతర కూటమి నాయకులతో సఖ్యతగా ఉండడం లేదని అంటున్నారు. అంతేకాదు.. ఎవరికి అందుబాటులో కూడా ఉండడం లేదని చెబుతున్నారు.
అభివృద్ధిపరంగా.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం పరంగా ప్రజలకు చేరువ కావడంలో కూన బాగానే పనిచేస్తున్నారు. కానీ కూటమి నాయకులను కలుసుకునే విషయంలోను..కూటమిగా బలోపేతం అయ్యే విషయంలోనే ఆయన వెనుకబడుతున్నారన్నది ప్రధాన సమస్య. దీనిని కూన సరిచేసుకుంటే.. ఆయనకు మరింత బలం చేకూరుతుందని అంటున్నారు. మరి ఆయన ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి. రెండేళ్ల ఎమ్మెల్యేగా.. కూనకు మంచి మార్కులే పడుతున్నాయి.
