రోశయ్య నుంచి ఎర్లీ మార్నింగే బాబుకు ఫోన్ వచ్చేది !
కొణిజేటి రోశయ్య. పాత తరానికి చెందిన రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ నుంచి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి అందులోనే చివరి దాకా కొనసాగిన నిబద్ధత కలిగిన నాయకుడు.
By: Satya P | 1 Sept 2026 9:18 AM ISTకొణిజేటి రోశయ్య. పాత తరానికి చెందిన రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ నుంచి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి అందులోనే చివరి దాకా కొనసాగిన నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన ఎమ్మెల్సీగా ఎంపీగా ఎమ్మెల్యేగా మూడు చట్ట సభలలో పనిచేశారు. ఇక అనేక మంత్రిత్వ శాఖలతో పాటు హోం శాఖను కూడా చూసిన రోశయ్య అంటేనే గుర్తుకు వచ్చేది ఆర్ధిక శాఖ. ఈ చిట్టాపద్దులు అన్నీ చాలా పకడ్బందీగా వేసి మరీ అసెంబ్లీకి బడ్జెట్ తో వచ్చేవారు ఆయన. రోశయ్య ఆర్థిక మంత్రిగా ఒక రికార్డుని క్రియేట్ చేశారు.
కీలక బాధ్యతలెన్నో :
అది ఈ రోజుకీ ఎవరూ బద్ధలు కొట్టలేనిది. ఆయన ఏకంగా 16 సార్లు అసెంబ్లీకి బడ్జెట్ సమర్పించారు. వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత రోశయ్య ఉమ్మడి ఏపీకి సీఎం గా ఒక ఏడాది పాటు పనిచేశారు. ఆయనను తమిళనాడు గవర్నర్ గా కూడా నాటి యూపీఏ ప్రభుత్వం నియమించింది. కొద్ది సంవత్సరాల క్రితం రోశయ్య ఈ లోకాన్ని వీడి దివికి పయనం అయ్యారు. అలాంటి రోశయ్యను ఇపుడు ఎందుకు తలచుకోవడం అంటే ఆయన నిలువెత్తు విగ్రహాన్ని విశాఖలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని దానికి పేరు పెట్టారు.
లోకేష్ వ్యాఖ్యలు :
ఇదిలా ఉంటే రోశయ్య విగ్రహావిష్కరణ సందర్భంగా నారా లోకేష్ ఆయనను తలచుకున్నారు. రోశయ్య గురించి తన చిన్న నాటి నుంచి వింటూ పెరిగాను అన్నారు. ఆయన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఎంతో కష్టపడి రోశయ్య కీలక స్థానానికి వచ్చారు అన్నారు. ఇదిలా ఉంటే 2004 నుంచి 2009 మధ్యలో తన తండ్రి చంద్రబాబు ఉమ్మడి ఏపీలో విపక్ష నేతగా ఉండేవారు అని ముఖ్యమంత్రి వైఎస్సార్ కి ఆయనకు మధ్య అసెంబ్లీలో ఆనాడు హోరా హోరీగా వాడిగా వేడిగా చర్చలు జరిగేవని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రతీ రోజూ ఎర్లీ మార్నింగ్ రోశయ్య నుంచి చంద్రబాబుకు ఫోన్ వచ్చేదని ఈసారి సభలో కొంత సహకరించాలని రోశయ్య కోరేవారని లోకేష్ పాత విషయాలను చెప్పి ఆసక్తిని కలిగించారు.
రోశయ్య అప్పట్లో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేసేవారు. దాంతో సభలో చర్చ సాఫీగా జరగాలని ఆయన చేసిన ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలను కలుపుకుని పోయేవారు అని లోకేష్ ఈ విధంగా గుర్తు చేశారు.
ఎంతో నేర్చుకోవాలి :
తమలాంటి నాయకులు రోశయ్య నుంచి ఎంతో నేర్చుకోవాలని లోకేష్ చెప్పడం విశేషం. అంతే కాదు భావి తరాలు కూడా రోశయ్య స్పూర్తిని పొందాలని ఆకాంక్షించారు. తాను చిన్నపుడు అయితే విగ్రహాలు నాయకులకు పెట్టడం అవసరమా అనుకునేవాడిని అని అయితే విగ్రహాలు మహనీయులవి పెట్టడం వల్ల రేపటి తరాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని లోకేష్ అన్నారు. రోశయ్య పేరుతో మ్యూజియం అలాగే, పాఠ్య పుస్తకాలలో పాఠం వంటివి చేయడానికి తమ వంతుగా సహకారం ఉంటుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు. మొత్తం మీద రోశయ్య గురించి లోకేష్ చెప్పిన విషయాలు అందరిలోనూ ఆలోచనలు కలిగించాయి. తన కంటే సీనియర్లు పూర్వీకుల గురించి తెలుసుకుని ఆయన మాట్లాడిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది.
