'కొండపి'పై అప్పుడే కన్ను.. ఏం జరుగుతోంది.. ?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలో రాజకీయాలు మారే పరిస్థితి కనిపిస్తోంది.
By: Garuda Media | 9 Sept 2025 8:00 PM ISTఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలో రాజకీయాలు మారే పరిస్థితి కనిపిస్తోంది. 2027-28 నాటికి రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో నియోజకవర్గాల ముఖచిత్రం కూడా మారిపోతుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. వాస్తవానికి విభజన చట్టం ప్రకారం 2021లోనే డీ లిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, జనాభా లెక్కలు వాయిదా పడిన నేపథ్యంలో దీనిని కూడా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం సహా వైసిపి ప్రభుత్వం కూడా డి లిమిటేషన్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు సంప్రదించాయి.
అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రక్రియ 2027-28 నాటికి ఖచ్చితంగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన మొదలవుతుందని తెలుస్తోంది. దీనిని బట్టి వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల మార్పు చేర్పులు ఉంటాయి. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన కొండపి రాజకీయ నాయకులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. ఈ క్రమంలోనే టిడిపి నుంచి ప్రస్తుతం మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వరుసగా విజయాలు దక్కించుకుంటున్నారు.
అయితే, రేపు డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయి ఈ నియోజకవర్గం కనుక జనరల్ గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్న టిడిపిలోని బలమైన సామాజిక వర్గం నేతలు ఇప్పటినుంచే అక్కడ చక్రం తిప్పుతున్నారు. జనరల్ నియోజకవర్గంగా మారే అవకాశం కనుక ఉన్నట్లయితే డోలా బాల వీరాంజనేయ స్వామిని తప్పించి వారు చక్రం తిప్పాలన్నది వ్యూహం. వచ్చే ఎన్నికలనాటికి వారే టికెట్ దక్కించుకోవాలన్నది ప్రస్తుతం జరుగుతున్న వ్యూహరచన. ఈ క్రమంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా తమకు ఉన్న బలాలను నిరూపించుకునేందుకు తమ వర్గం వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా యి.
దీంతో ప్రస్తుతం కొండపిలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు అయినా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి.. ఎవరినీ తక్కువగా అంచనా వేసే పరిస్థితి ఉండదు. ప్రధానంగా డీలిమిటేషన్ జరిగితే.. అనేక ఎస్సీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంటుందన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కొండపిలో టీడీపీకి చెందిన ఓ సోదర ధ్వయం.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే జరిగితే.. మంత్రి స్వామి పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. మరి ఆయన వేరే నియోజకవర్గం చూసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతానికి మాత్రం ఆయన ఈ విషయం పై దృష్టి పెట్టకపోయినా.. ఇద్దరు సోదరులు మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
