Begin typing your search above and press return to search.

కొండపల్లికి కొండంత అండ అదేనా ?

ఆయన చిన్నాన్న కొండపల్లి అప్పలనాయుడు ని కాదని టికెట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇలా గెలిచి వచ్చారో లేదో అలా మంత్రి పదవి ఇవ్వడం మరో విశేషం.

By:  Satya P   |   10 March 2026 10:00 AM IST
కొండపల్లికి కొండంత అండ అదేనా ?
X

విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ది పొలిటికల్ గా జాక్ పాట్ అని అంటారు. ఆయన చిన్నాన్న కొండపల్లి అప్పలనాయుడు ని కాదని టికెట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇలా గెలిచి వచ్చారో లేదో అలా మంత్రి పదవి ఇవ్వడం మరో విశేషం. దాంతో చిన్న వయసులోనే రాజకీయంగా లక్కీ చాన్స్ కొట్టేశారు అని అంతా అంటూంటారు. ఆయన తాత కొండపల్లి పైడితల్లి నాయుడు నుంచి టీడీపీని ఆ కుటుంబం నమ్ముకుంది. ఇక కొండపల్లి అప్పలనాయుడు పైడితల్లి నాయుడు వారసత్వం అంది పుచ్చుకుని 2014లో ఎమ్మెల్యే అయ్యారు. కానీ 2019 లో ఓటమి చూసారు. ఇక 2024 లో గెలిచి చూపిద్దామని అనుకుంటే అన్నయ్య కొడుకు రూపంలో మూడవ తరంగా శ్రీనివాస్ రంగంలోకి దిగారు. దాంతో హైకమాండ్ కూడా ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడంతో బాబాయ్ వెనక్కి తగ్గక తప్పని నేపథ్యం ఉంది.

మినిస్టర్ గా గ్రాఫ్ :

ఇదిలా ఉంటే కొండపల్లి శ్రీనివాస్ కి కీలక శాఖలే దక్కాయి. ఆయన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ప్రవాసాంధ్రుల శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఆయన తన శాఖల పట్ల మంచి పట్టు సాధించారు ఇపుడు ఆయన బాగానే రాణిస్తున్నారు. ఇక ఆయనలో మరో విశేషం ఏమిటి అంటే అవినీతికి సంబంధించి ఒక్క ఆరోపణ ఆయన మీద ఆయన శాఖల మీద ఎక్కడా రాకపోవడం. పైగా మంత్రి మంచి వారు అన్న పేరు తెచ్చుకున్నారు. తన నియోజకవర్గం ప్రజలకు క్యాడర్ కి ఎంతో అందుబాటులో ఉంటున్నారు. 21 నెలల పాలనలో గజపతినగరం నుంచి ఆయన బాగానే పార్టీ పటిష్టతకు కృషి చేశారు అని నివేదికలు చెబుతున్నాయి.

ఈ విషయాలే ఇబ్బందిగా :

అయితే విజయనగరం జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. ఈ రోజు దాకా స్థానిక సంస్థలు ఆ పార్టీ చేతిలోనే ఉన్నాయి. ఇక బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు అక్కడ ఉన్నారు. దాంతో టీడీపీ పరంగా జిల్లాను మొత్తం కలుపుకుని పోవాల్సి ఉంది. అలాగే కూటమి పార్టీలను కో ఆర్డినేట్ చేసుకుంటూ జిల్లాలో కూటమిని పై చేయిగా ఉంచాల్సి ఉంది. ఇలా రాజకీయంగా వ్యూహాలు రూపొందించి వైసీపీని ధీటుగా ఎదుర్కొనే విషయంలోనే కొండపల్లి కొంత వెనకబడి ఉన్నారని అంటున్నారు. ఇదే ఇపుడు హైకమాండ్ వద్ద కూడా చర్చగా ఉందని ప్రచారం సాగుతోంది.

విస్తరణ మీద ఆశలు :

ఇక విస్తరణ అంటూ జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని చీపురుపల్లి కి చెందిన ఎమ్మెల్యే కళా వెంకట్రావు కోరుతున్నారు అని ప్రచారంలో ఉంది. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. పైగా రాజకీయ వ్యూహ రచనలో నిపుణుడు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి అలాంటి సీనియర్ల అవసరం ఉందని పార్టీ భావిస్తోంది. ఇటీవల చీపురుపల్లికి చంద్రబాబు వెళ్లారు. సామాజిక పెన్షన్ల పంపిణీని ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీపురుపల్లిని టీడీపీకి స్ట్రాంగ్ గా చేశారు అని కళాకి కితాబు ఇచ్చారని అంటున్నారు.

కచ్చితంగా బెర్త్ దక్కుతుందని :

దాంతో కళాకు రానున్న కాలంలో ప్రమోషన్ దక్కుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. అయితే కొండపల్లి శ్రీనివాస్ మంచి మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన శాఖల పరంగా కూడా బాగానే చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఆయనను ఎలా తప్పిస్తారు అన్న చర్చ ఒక వైపు సాగుతోంది. కానీ రాజకీయ అవసరాల రిత్యా సమీకరణల కారణంగా ఏమైనా మార్పు చేయాలనుకుంటే మాత్రం కొండపల్లికి ఇబ్బంది అవుతుందని అపుడు కళాకు కచ్చితంగా బెర్త్ దక్కుతుందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో ఏమిటి అన్నది.