మంత్రి కొండపల్లి 'స్థానిక' పాలిటిక్స్.. !
ఇటీవల వైసీపీకి చెందిన గజపతినగరం వైస్ ఎంపీపీ కర్రి శ్రీదేవి, మాజీ సర్పంచ్‌లతో పాటు దాదాపు 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం కూడా మంత్రి కనుసన్నల్లోనే జరిగాయి.
By: Garuda Media | 16 Sept 2026 12:00 AM ISTగత 2024 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని గజపతినగరం స్థానం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాస్.. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. నాటి ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీని ఎదిరించి.. గెలిచిన కొండపల్లి.. ఇప్పుడు కూడా అదే హవాను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాటి విజయానికి కొనసాగింపుగా.. స్థానిక రాజకీయాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కేలా వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు.
బొత్స ఫ్యామిలీకి చెక్..
ఇటీవల సీనియర్ రాజకీయ కుటుంబం బొత్స ఫ్యామిలీకి చెక్ పెడుతూ.. జడ్పీచైర్మన్, వైసీపీకి నిన్నటి వరకు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు ఉరఫ్ చిన్న శ్రీను సైకిల్ ఎక్కడంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు తన రాజకీయ వ్యూహం తనకు ఉంది. మంత్రిగా తొలి యేడాది నియోజకవర్గంలో పట్టుచిక్కడంలో ఆలస్యమైనా రెండో యేడాది నుంచి ప్రారంభమైన ఆయన దూకుడు.. ఇప్పుడు మరింత పట్టుపెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గత యేడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో టీడీపీ మరింత బలం పుంజుకుంది.
ఇటీవల వైసీపీకి చెందిన గజపతినగరం వైస్ ఎంపీపీ కర్రి శ్రీదేవి, మాజీ సర్పంచ్‌లతో పాటు దాదాపు 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం కూడా మంత్రి కనుసన్నల్లోనే జరిగాయి. దీంతో ఇక్కడి రాజకీయాల్లో పెద్ద మార్పు చోటు చేసుకుంది. గజపతి నగరం నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉన్న స్థానిక నేతలు, మాజీ ఇన్‌ఛార్జ్‌ల వర్గాల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు వరుసగా నిర్వహిస్తున్నారు.
గతంలో ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన బొత్స అప్పలనర్సయ్య వర్గం, వైసీపీ స్థానిక నాయకత్వం పార్టీ క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. కీలక నేతల వలసలు పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారినా క్షేత్రస్థాయిలో తిరిగి పట్టు సాధించేందుకు వారు ప్రణాళికలు వేస్తున్నారు. కానీ.. అధికార పక్షం (టీడీపీ) తమ విజయ పరంపరను స్థానిక సంస్థల్లోనూ కొనసాగించాలని చూస్తుండగా, వైసీపీ తమ ఉనికిని చాటుకోవడానికి గట్టిగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మంత్రి కొండపల్లి వ్యూహ ప్రతివ్యూహాలతో కూటమిని బలంగా తీర్చిదిద్దుతున్నారు.
