రేవంత్‌కు కళ్లు నెత్తికెక్కాయా? కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో పరకాల నియోజకవర్గం కేంద్రంగా కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి.
By: A.N.Kumar | 19 Aug 2026 6:21 PM ISTతెలంగాణ రాజకీయాల్లో పరకాల నియోజకవర్గం కేంద్రంగా కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా? అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల పరకాల నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డినే మళ్లీ పోటీ చేయిస్తామని ప్రకటించారు. ప్రజలు మరోసారి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కూడా కోరారు. అయితే ఈ ప్రకటన కొండా కుటుంబంలో అసంతృప్తికి కారణమైనట్లు తెలుస్తోంది.
పరకాల నుంచి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్న కొండా సుస్మిత.. ఇప్పటికే నియోజకవర్గంలో తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఆమె తండ్రి కొండా మురళి కూడా సుస్మిత ఎన్నికల్లో పోటీ చేస్తుందని గతంలో ప్రకటించారు. దీంతో పరకాల కాంగ్రెస్‌లో రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గం, కొండా కుటుంబం మధ్య రాజకీయ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో సుస్మిత.. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీని రేవంత్ రెడ్డి ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారు. రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు.
అంతకుముందు కూడా సుస్మిత తన సోషల్ మీడియా పోస్టులతో పరకాల రాజకీయాలపై ఆసక్తిని రేకెత్తించారు. తనను పరకాలకు కాబోయే ఎమ్మెల్యేగా పేర్కొంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టడం చర్చకు దారితీసింది. ఇప్పుడు నేరుగా సీఎంపైనే విమర్శలు చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.
అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సుస్మిత ప్రకటించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరకాలలో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేవూరి ప్రకాశ్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే ఆయనకు మరోసారి టికెట్ ఖరారు చేస్తామని సీఎం బహిరంగంగా ప్రకటించారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు పరకాల నియోజకవర్గంపై కొండా కుటుంబానికి చాలాకాలంగా ఆసక్తి ఉందని, సుస్మితను అక్కడి నుంచి బరిలోకి దింపాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. మరోవైపు కొండా సుస్మిత తిరుగుబాటు స్వరం.. దీంతో పరకాల కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సుస్మిత వ్యాఖ్యలపై రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే కాంగ్రెస్ అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుతుందన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
