'కొండ'క్క .. కొత్త సవాల్ !
మంత్రి పదవి పోయినందుకు నాకు బాధలేదని, అయితే అకారణంగా తొలగించడం బాధగా ఉందని, పదవులు ఇవాళ ఉంటాయి.
By: Garuda Media | 14 Sept 2026 9:15 AM IST‘నా మంత్రి పదవి పోయిన తరువాత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నా మీద పోటీ చేసి గెలుస్తానని సవాల్ విసురుతున్నాడు. నేను రాజీనామా చేస్తే పోటీ చేయడం తరువాత సంగతి. ముందు నా అనుచరుల మీద పోటీ చేసి కార్పోరేటర్ గా గెలువు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మా మీద విమర్శలు చేస్తున్నాడు. ఎమ్మెల్యే కాక ముందు నియోజకవర్గంలో వినయ్ భాస్కర్ ను తట్టుకోలేక నియోజకవర్గంలోని కార్యక్రమాలకు నన్ను, కొండా మురళిని బతిమాలి తీసుకువెళ్లేవాడు. భద్రకాళి ఆలయ పదవి విషయంలో నానా హంగామా చేసిన నాయిని రాజేందర్ రెడ్డి పదవి ఆయన అనుచరుడికి కాకుండా, ఆయన నియోజకవర్గానికి కాకుండా పోతే ఎందుకు మౌనంగా ఉంటున్నాడు’ అంటూ వరంగల్ లో తన మద్దతు దారులతో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కొండా సురేఖ తనను విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇచ్చింది.
కొండా సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన అనంతరం ఇప్పటి వరకు బయటకు రాని కొండా సురేఖ, కొండా మురళి దంపతులు వరంగల్ లోని తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో తొలిసారి సమావేశం అయ్యారు. ‘నన్ను మంత్రి పదవి నుండి తొలగించిన వెంటనే అల్లర్లు చేద్దామని నాకు కొందరు ఫోన్ చేశారు. కానీ నేను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉందామని చెప్పాను. నాకు అండగా ఉన్న వారికి ధన్యవాదాలు అని కొండా సురేఖ అన్నారు.
మంత్రి పదవి పోయినందుకు నాకు బాధలేదని, అయితే అకారణంగా తొలగించడం బాధగా ఉందని, పదవులు ఇవాళ ఉంటాయి. రేపు పోతాయి. కానీ ప్రజల్లో చిరస్థాయిగా ఉండడమే తమ లక్ష్యం అని కొండా సురేఖ వెల్లడించింది. రేవంత్ రెడ్డి మాస్ లీడర్ గా కాంగ్రెస్ పార్టీకి అవసరం అని మొదటగా చెప్పింది తామేనని, గతంలో తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం రాజీనామా చేశానని, కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతానని, 2028లో వరంగల్ ఈస్ట్ నుండే పోటీ చేసి గెలుస్తానని, మళ్లీ మంత్రి అవుతానని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుచుకుంటామని అన్నారు.
‘సురేఖను సారీ చెప్పమన్నారు. కనీసం కాగితం మీద రాసి ఇమ్మన్నారు. పదవి ఉంటే ఉండనీ, పోతే పోనీ అని సారీ చెప్పలేదు. ఆత్మగౌరవం కంటే పదవి ముఖ్యం కాదు. కొండా సురేఖది, నాదీ ఒకే మాట, నా బిడ్డ సుష్మితది వేరే మాట. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 24 కార్పోరేటర్ సీట్లు గెలుస్తామని’ కొండా సురేఖ భర్త కొండా మురళి ఈ సంధర్భంగా అనడం విశేషం.
మంత్రి పదవి నుండి తొలగించిన తరువాత కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి ఫోన్లు వచ్చాయని, ఒకసారి వచ్చి కలవాలని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొండా మురళికి కీలక పదవి దక్కుతుందన్న ప్రచారం ఒకవైపు, కొండా సురేఖకు పార్టీలో కీలక పదవి దక్కుతుందని మరో వైపు ప్రచారం జరుగుతున్నది.
మంత్రిపదవి నుండి తొలగించిన తరువాత కొండా సురేఖ శాసనసభ సమావేశాలకు గానీ, సీఎల్పీ సమావేశాలకు గానీ హాజరుకాలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ కొండా సురేఖను పార్టీ కార్యక్రమాలలో చురుకుగా ఉండాలని ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితులలోనే వారు బయటకు వచ్చి తమ మద్దతుదారులతో సమావేశమై తాము పార్టీని వీడం అన్న స్పష్టమయిన సంకేతాలు ఇస్తున్నారా ? అన్న చర్చ మొదలయింది.
