Begin typing your search above and press return to search.

క్యాబినెట్ భేటీకి వెళ్లకుండా కొండా సురేఖ తప్పు చేశారా?

తెలిసి తప్పు చేయకూడదన్న విషయాన్ని ఎవరైనా చెబుతారు. కొన్ని సందర్భాల్లో తగ్గటం తప్పు కూడా కాదు.

By:  Garuda Media   |   3 July 2026 2:57 PM IST
క్యాబినెట్ భేటీకి వెళ్లకుండా కొండా సురేఖ తప్పు చేశారా?
X

తెలిసి తప్పు చేయకూడదన్న విషయాన్ని ఎవరైనా చెబుతారు. కొన్ని సందర్భాల్లో తగ్గటం తప్పు కూడా కాదు. మొండితనం కొన్నిసార్లు ఆభరణమైతే.. మరికొన్నిసార్లు మూర్ఖత్వంగా మారుతుంది. కాలానికి అనుగుణంగా.. వాతావరణానికి తగ్గట్లు.. పరిస్థితులు.. పరిణామాలను చూసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రంగాల్లో కంటే రాజకీయాల్లో వీటి అవసరం చాలా ముఖ్యం. ఇలాంటివేమీ పట్టించుకోకుండా తనకు తోచినట్లుగా చేస్తానంటే సమస్యలు.. సవాళ్లే తప్పించి మరింకేమీ మిగలవన్న విషయాన్ని రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉంటున్న మంత్రి కొండా సురేఖకు తెలియకపోవటమే అసలు సమస్య. ఆమె కళ్లతో ఆమె చాలామంది ముఖ్యమంత్రుల్నే చూశారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె మూడు దఫాలు మంత్రిగా వ్యవహరించారు. వైఎస్ హయాంలో ఆమెకు మంత్రి పదవి దక్కితే.. రోశయ్య ప్రభుత్వంలోనూ ఆమె మంత్రిగా కొనసాగారు. గ్యాప్ తర్వాత మళ్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆమె మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. మంత్రి హోదాలో ఆమె ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పని చేస్తే.. ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఆమె పలువురు సీఎంల వ్యవహారశైలి ఎలా ఉంటుందన్న అంశంపై అవగాహన ఉంది.

మొండిగా వ్యవహరించటం.. నమ్మిన దాన్నే ఫాలో కావటం.. ఆ క్రమంలో ఎదురుదెబ్బలు తగిలిన పట్టించుకోకుండా ముందుకు వెళ్లే లక్షణాలు కొండా సురేఖలో ఎక్కువ. ఇంతకాలం ఇవన్నీ ఆమెకు ఆభరణాలుగా మారితే.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆ మైండ్ సెట్ ఇప్పుడు మైనస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రోశయ్య.. కిరణ్ కుమార్ రెడ్డి.. కేసీఆర్ లతో పోలిస్తే రేవంత్ కాస్త డిఫరెంట్ మైండ్ సెట్. ఆయనతో తగువు కన్నా.. సర్దుకుపోవటమే మంచిది. తగ్గితే.. సర్లే అనుకునే రకం. అదే సమయంలో సరే చూసుకుందామంటే.. చూసుకుందామని స్పందించే తీరు కూడా ఆయనలో కనిపించదు.

కాకుంటే.. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని.. తనకంటూ సమయం వచ్చే వరకు వెయిట్ చేసే రకం. అందుకు ఎంత కాలమైనా ఓపిగ్గా ఎదురుచూసి.. తనదైన టైంలో వడ్డీతో సహా లెక్క సెటిల్ చేసుకోవటానికి మొహమాటపడరు. అదే సమయంలో.. కాస్త తగ్గి.. ఈసారి వదిలేయండని అడిగితే.. దాన్ని లాగకుండా అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే రకంగా చెబుతారు. కింద నుంచి పైకి మెట్టు మెట్టు ఎదుగుతూ రావటం.. ఈ క్రమంలో డక్కామొక్కీలు తిన్న రేవంత్ ఎంత సాఫ్ట్ గా కనిపిస్తారో.. అంతకు మించి టఫ్ అన్న విషయాన్ని ఆయన గురించి తెలిసిన వారంతా చెబుతారు.

ఇదంతా చూసినప్పుడు కొండా సురేఖ రాజకీయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో తన శాఖకు సంబంధించి ఆమె పట్టు సాధించే విషయంలో వెనుకబడి ఉండటమే కాదు.. అవినీతి ఆరోపణలకు చెక్ పెట్టే విషయంలోనూ ఆమె ఫెయిల్ అయ్యారన్న విమర్శ వినిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికి..దేవాదాయ శాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఆమె తీరు కూడా ఒక కారణమన్న అభిప్రాయం ఉంది. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అంశాల్లో ఆమె మెతక వైఖరి ప్రదర్శించటం సీఎం రేవంత్ కు అస్సలు నచ్చలేదంటారు.

యాదగిరిగుట్టు బోర్డు సభ్యుల ఎంపిక విషయంలో తనను సంప్రదించకుండా.. తన శాఖకు సంబంధించిన అంశాల్ని సీఎం రేవంత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం ఏమిటన్న ప్రశ్నను కొండా సురేఖ తన సన్నిహతుల వద్ద వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడే ఆమె ఒక కీలక అంశాన్ని మిస్ అవుతున్నారని చెప్పాలి. సీఎం రేవంత్ శక్తిసామర్థ్యాల్ని తక్కువగా అంచనా వేయటమే దీనికి కారణంగా చెప్పాలి. ఆమె ఎంతగానో అభిమానించే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయానికే వద్దాం. టీటీడీ బోర్డు ఛైర్మన్ ఎంపిక.. బోర్డు సభ్యుల ఎంపిక విషయంలో సంబంధిత మంత్రి అభిప్రాయాన్ని తీసుకుంటారా? అని ప్రశ్నిస్తే కాదనే చెబుతారు.కాకుంటే.. తనకు అవసరమైన ఒకట్రెండు పేర్లు చెప్పి.. కాస్త వాళ్లు బోర్డు సభ్యులుగా ఎంపిక చేయాలని స్నేహపూర్వకంగా కోరితే ఓకే చేసేవారని చెబుతారు.

అలాంటి విషయాలు తెలిసిన కొండా సురేఖ.. తాజా ఉదంతంలో యాదగిరి గుట్టు బోర్డు సభ్యుల వివరాల్ని తనతో చర్చించాలని కోరుకోవటం అత్యాశే అవుతుంది కదా? మంత్రిగా తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ.. తనకంటూ ఒక మార్క్ ను ప్రదర్శిస్తుంటే.. సీఎం సైతం కొంత తగ్గాల్సి ఉండేది. ఆమె పని తీరు.. పాపులార్టీకి అనుగుణంగా రేవంత్ స్పందన ఉండేది. అందుకు భిన్నంగా ఇప్పటికే పలు అంశాల్లో ఆమె విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భం.. గతంలోనూ సీఎం రేవంత్ తో ఉన్న పంచాయితీల నేపథ్యంలో ఆమెకు చెప్పి.. ఆమెతో చర్చించి యాదగిరి గుట్టు బోర్డును డిసైడ్ చేయాలని భావించటమే అత్యాశే అవుతుంది కదా?

తాజాగా జరిగినమంత్రివర్గ భేటీకి గైర్హాజరు కావటం వల్ల నష్టం కొండా సురేఖకే తప్పించి.. సీఎం రేవంత్ కు కాదు. విదేశీ పర్యటన ముంగించుకొని..కాలు సరిగా లేకపోవటం వల్ల మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదన్న సమాచారాన్ని ఇవ్వటం ద్వారా ఆమె సాధించిందేంటి? మరో అంశం ఏమంటే సీఎం రేవంత్ మైండ్ సెట్ తెలిసిన వారెవరూ కూడా ఆయనతో పెట్టుకునే కన్నా.. ఆయనతో రాజీ చేసుకోవటమే మంచిదన్న మాటను చెబుతారు. ఇలా ఏ యాంగిల్ లో చూసినా..తాజా పరిస్థితుల్లో కొండా సురేఖ కాస్త తగ్గితేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.