Begin typing your search above and press return to search.

ఆ శాఖకు మంత్రయితే .. అంతే సంగతులు

తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది.

By:  Garuda Media   |   3 Sept 2026 3:20 PM IST
ఆ శాఖకు మంత్రయితే .. అంతే సంగతులు
X

తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఆమె తన పదవికి రాజీనామా చేయకుంటే మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారికి పదవీగండం తప్పదని, లేదా రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొంటారన్న అంశం మరోసారి ప్రచారంలోకి వచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేసిన వారి రాజకీయ ప్రగతి ఆశించిన స్థాయిలో సాగలేదు. రాజకీయ వత్తిళ్లు, వివాదాలు, పార్టీలు మారడం జరుగుతూ వస్తుంది. 2023లో దేవాదాయ శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ నాగార్జున, కేటీఆర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, నేరుగా రేవంత్ రెడ్డి మీద ఆమె కూతురు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమె పదవి నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురయింది.

ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 1999 - 2004 కాలంలో దేవాదాయ మంత్రిగా పనిచేసిన దండు శివరామరాజు ఆ తర్వాత రాజకీయాల్లో పెద్దగా రాణించకుండానే 2010లో కన్నుమూశారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు మంత్రి వర్గంలో దేవాదాయ మంత్రిగా పనిచేసిన పైడికొండల మాణిక్యాల రావు టీడీపీ - బీజేపీ కూటమి సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో 2018 మార్చిలో రాజీనామా చేశారు. ఆ తర్వాత కోవిడ్ సమయంలో మరణించారు.

2018 - 2019 కాలంలో ఏపీలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి ఆ తర్వాత రాజకీయాల్లో పెద్దగా రాణించలేదు. వైసీపీ ప్రభుత్వంలో 2019 - 2022 మధ్య కాలంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ వివిధ ఆరోపణల నేపథ్యంలో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత పనిచేసిన కొట్టు సత్యనారాయణ ప్రభుత్వ మార్పిడితో 2024లో పదవిని కోల్పోయారు.

సింహాద్రి సత్యనారాయణ, గాదె వెంకట్ రెడ్డి, సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు, గంగాధర్, ఎం సత్యనారాయణరావు, జె. రత్నాకర్ రావు, జేటీ రామారావు, కేవీ రమణారెడ్డి, ఎస్.గంగాధర్, మహిపాల్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు తదితరులు దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేసి ఒడిదుడుకులు ఎదుర్కొన్న వారే కావడం గమనార్హం. కొండా సురేఖ వివాదం నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రుల రాజకీయ భవితవ్యం వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది.