సురేఖ ఒంటరికాదు.. కాంగ్రెస్‌లో గుసగుస!
సురేఖ ఒంటరికాదు.. ఆమె వెనుక బలమైన శక్తి ఉందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో చర్చకు వచ్చింది. నిజా నికి ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ ఎస్ బలం తగ్గిపోయింది.
By: Garuda Media | 3 Sept 2026 11:19 PM ISTతెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ సై.. అంటే సై అంటున్నారు. పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు.. ఏ నాయకుడైనా తలవంచుతారు.కానీ, ఆమె ఎక్కడా తగ్గేదేలే.. అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిపైనే మరోసారి విరుచుకుపడ్డారు. ఒకవైపు.. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని చెబుతూ.. సమస్యను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే.. లేదు. పైగా.. రేవంత్‌రెడ్డికే నోటీసులు ఇవ్వాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లోనూ తానే ముఖ్యమంత్రినని చెబుతున్న రేవంత్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. సో.. ఇది తెగపోయే గాలిపటమన్న విషయం తెలిసిందే. అయితే.. తెగిపోతూ.. తెగిపోతూ.. ఏదో సంక్షోభాన్ని కాంగ్రెస్ నెత్తిన పెట్టి వెళ్లాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, కొండా రాజకీయాల్లో ఇవన్నీ కామన్. ఆమె గతంలో చేసిన నిర్వాకాలు కూడా ఇలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొండా వెనుక ఎవరున్నారన్న వ్యవహారం కాంగ్రెస్‌లో ఆసక్తిగా మారింది.
సురేఖ ఒంటరికాదు.. ఆమె వెనుక బలమైన శక్తి ఉందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో చర్చకు వచ్చింది. నిజానికి ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ ఎస్ బలం తగ్గిపోయింది. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్యామిలీ కాంగ్రెస్‌కు జై కొట్టిన తర్వాత.. ఇక్కడ బీఆర్ ఎస్‌కు గ్యాప్ ఉందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో కొండాను మరోసారి బీఆర్ ఎస్ దువ్వుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఆమె బీఆర్ ఎస్‌లో పనిచేశారు. తర్వాత.. బయటకు వచ్చారు.
అయితే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు కదా!. కానీ, అక్కడ కూడా కొండా బాగానే కెలికేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆమె ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర వివాదానికి దారి తీసి.. పరువు నష్టం కేసులో సారీ చెప్పారు. ఇదంతా మరిచిపోయారని అనుకున్నారేమో.. ఇప్పుడు బీఆర్ ఎస్ అండ ఉందన్న చర్చకు బీజం పడింది.
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే తప్ప.. బీఆర్ ఎస్ పుంజుకునే పరిస్థితి లేదన్నది సుస్పష్టం. దరిమిలా.. సురేఖ కు పరోక్షంగా తెరవెనుక బీఆర్ ఎస్ ఉందేమోననన్న చర్చ కాంగ్రెస్‌లో వినిపిస్తుండడం గమనార్హం. నిజానికి ఈ మద్దతులేకపోయి ఉంటే.. సురేఖ ఇంత హాట్ వ్యాఖ్యలుచేయరు.. తెగతెంపులు చేసుకునేలా వ్యవహరించరన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
