రేవంత్ రెడ్డికి ‘సారీ’ చెప్పమంటే కొండా సురేఖ మంత్రి పదవిని వదులుకుంది : కొండా మురళీ సంచలన కామెంట్స్
మంత్రి పదవిని కాపాడుకోవడానికి క్షమాపణ చెప్పే బదులు.. పదవిని వదులుకునేందుకు కొండా సురేఖ సిద్ధపడ్డారని ఆయన వెల్లడించారు.
By: A.N.Kumar | 13 Sept 2026 10:31 PM ISTతెలంగాణ కాంగ్రెస్‌లో కొండా దంపతుల వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ ఆదివారం తమ ముఖ్య కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. మంత్రి పదవిని కాపాడుకోవడానికి క్షమాపణ చెప్పే బదులు.. పదవిని వదులుకునేందుకు కొండా సురేఖ సిద్ధపడ్డారని ఆయన వెల్లడించారు.
సారీ చెబితే పదవి ఉండేది.. కానీ సురేఖ ఒప్పుకోలేదు
సీఎం రేవంత్‌రెడ్డికి కాగితంపై ‘సారీ’ అని రాసి ఇస్తే మంత్రి పదవి కొనసాగుతుందని కొండా సురేఖకు సూచించినట్లు కొండా మురళీ తెలిపారు. అయితే పదవి కోసం తాను క్షమాపణ చెప్పబోనని సురేఖ స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. “మంత్రి పదవి పోయినా పర్వాలేదు.. సారీ చెప్పను” అనే ధోరణితో సురేఖ వ్యవహరించారని మురళీ చెప్పడం చర్చనీయాంశమైంది. పదవులు శాశ్వతం కాదని.. కానీ ఆత్మగౌరవం విషయంలో రాజీపడేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ క్షమాపణ చెప్పి ఉంటే మంత్రి పదవి కొనసాగేదేమోనని.. కానీ తమ కుటుంబం పదవుల కోసం మాట మార్చే కుటుంబం కాదని స్పష్టం చేశారు. “ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవిలో ఉండటం కంటే.. పదవిని వదులుకోవడమే మంచిది” అన్నట్టుగా కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో చర్చకు దారితీశాయి.
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు..
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వాటికి మురళీ తెరదించారు. తమ ఇద్దరిదీ ఒకటే మాట అని, కాంగ్రెస్‌ను వీడే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దీంతో పార్టీపై తమ వైఖరి స్పష్టంగానే ఉందని కొండా దంపతులు సంకేతాలిచ్చారు.
ఢిల్లీ పిలుపులపై సురేఖ స్పందన ఏమిటి?
కొండా సురేఖను ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం నుంచి పలుమార్లు పిలుపులు వచ్చినట్లు మురళీ తెలిపారు. అయినప్పటికీ ఆమె ఢిల్లీకి వెళ్లలేదని చెప్పారు. శనివారం కూడా అధిష్ఠానం నుంచి ఫోన్ వచ్చినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో మరుసటి రోజే కార్యకర్తలతో కొండా దంపతులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఢిల్లీ పెద్దలతో కొండా సురేఖ భేటీ అవుతారా? పార్టీ ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అనే ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి.
కూతురు సుస్మిత విషయంలో క్లారిటీ
తమ కుమార్తె సుస్మిత రాజకీయ, వ్యక్తిగత నిర్ణయాలపై కూడా కొండా మురళీ స్పందించారు. ఆమెకు 38 ఏళ్ల వయసు ఉందని, తన నిర్ణయాలు తానే తీసుకుంటుందని చెప్పారు. ఆమె చేసే వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పరకాల నియోజకవర్గ వ్యవహారాలను సుస్మిత చూసుకుంటారని.. వరంగల్ ఈస్ట్ బాధ్యతలను కొండా సురేఖ, తాను చూసుకుంటామని మురళీ వెల్లడించారు.
బసవరాజు సారయ్యపై సవాల్
ఇదే సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యపై కొండా మురళీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో పార్టీ మారిన సమయంలో ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేశానని గుర్తుచేశారు. అదే విధంగా సారయ్యకు కూడా దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో సారయ్య ఎమ్మెల్సీ పదవి పోతుందని మురళీ జోస్యం చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తారని సారయ్య భావిస్తున్నారని.. కానీ అది జరగదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పది రోజుల తర్వాత మళ్లీ బహిరంగంగా..
ఇటీవలి రాజకీయ పరిణామాల తర్వాత దాదాపు పది రోజుల పాటు కొండా దంపతులు బహిరంగంగా పెద్దగా కనిపించలేదు. దీంతో వారి తదుపరి రాజకీయ అడుగుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం హనుమకొండ రామ్‌నగర్‌లోని వారి నివాసానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆ తర్వాత వరంగల్‌లోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్‌లో ముఖ్య కార్యకర్తలు, అభిమానులతో కొండా దంపతులు సమావేశమయ్యారు. కార్యకర్తలతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశం వెనుక భవిష్యత్ కార్యాచరణపై చర్చే ప్రధాన అంశమని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే సమావేశం అనంతరం కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. పదవి విషయంలో రాజీ పడకపోయినా.. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ను వీడే ఆలోచన కొండా దంపతులకు లేదని ఆయన తేల్చి చెప్పారు.
దీంతో కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు కేవలం మంత్రి పదవికి సంబంధించిన అంశంగానే కాకుండా.. ఆత్మగౌరవం, కాంగ్రెస్‌లో భవిష్యత్ రాజకీయ స్థానం, ఢిల్లీ అధిష్ఠానంతో సంబంధాలు, వరంగల్ రాజకీయాల్లో కొండా కుటుంబ ప్రభావం చుట్టూ తిరుగుతున్న అంశంగా మారింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉండనున్నాయి.
