Begin typing your search above and press return to search.

డబ్బు కోసం బెదిరించాడు.. రేవంత్ సన్నిహితుడు ఉన్నాడు - సురేఖ కూతురు

ఇటీవల డెక్కన్ సిమెంట్స్ అక్రమాల కేసు మళ్లీ వెలుగులోకి రావడంతో ఈ వివాదం మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

By:  A.N.Kumar   |   16 Oct 2025 12:25 PM IST
డబ్బు కోసం బెదిరించాడు.. రేవంత్ సన్నిహితుడు ఉన్నాడు - సురేఖ కూతురు
X

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపిన వివాదం.. మంత్రులు కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య నెలకొన్న ఘర్షణ. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే తలనొప్పిగా మారింది. సుస్మిత మాట్లాడిన మాటల వీడియోనే ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా, కొందరు జర్నలిస్టులు షేర్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల డెక్కన్ సిమెంట్స్ కేసు మళ్లీ వెలుగులోకి రావడంతో ఈ వివాదం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఏడాది కిందటే జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు బయటికి రావడం వెనుక కూడా అంతర్గత లావాదేవీలే ఉన్నాయన్నది మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

* సురేఖ కూతురు పేల్చిన బాంబ్

కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆమె ఇంటికి సుమంత్ (సురేఖ మాజీ ఓఎస్డీ) కోసం వెళ్లినప్పుడు.. ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో సుస్మిత చేసిన సెన్సేషనల్ వ్యాఖ్యలు ఇవి..

‘‘డెక్కన్ సిమెంట్ నిర్వాహకులను సుమంత్ డబ్బు కోసం బెదిరించాడని..

ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు రోహిన్ రెడ్డి అక్కడే ఉన్నారని... ఆయన తుపాకీతో సుమంత్‌ను బెదిరించాడని.. ఈ విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసుల దాకా తీసుకెళ్లాడని’ సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతోనే కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.

* మురళి ఎంట్రీతో సీన్ మారింది

ఇంతలో కొండా మురళి కూడా రంగంలోకి దిగారు. హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ “సుమంత్ వ్యవహారం గురించి నాకు తెలియదు. నిన్న రాత్రి హైడ్రామా జరిగింది. నా కూతురు పార్టీలో లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారు. రేవంత్, పొంగులేటి కలిసి మా ఇంటికి వచ్చారు. మరి ఇప్పుడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?” అంటూ ప్రశ్నించారు.

* సుస్మిత వీడియోతో మళ్లీ సెన్సేషన్

మురళి వ్యాఖ్యల తర్వాత కొద్ది గంటల్లోనే సుస్మిత సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆమె ఆరోపణలు మరింత తీవ్రంగా ఉన్నాయి.. “పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. నా తండ్రిని అరెస్టు చేసి, నా తల్లిని మంత్రి పదవి నుంచి తొలగించాలన్న కుట్ర జరుగుతోంది. బీసీలను పక్కన పెట్టే యత్నం చేస్తున్నారు.’’ అన్న ఈ వీడియోతో వివాదం కొత్త మలుపు తీసుకుంది.

* ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయనుంది?

ఇద్దరూ పార్టీకి కీలకమైన నేతలు కావడంతో ఇప్పుడు ఈ ఇష్యూ కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? పార్టీ హైకమాండ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మొత్తానికి ఈ వివాదం తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలానికి దారి తీస్తుంది. ఈ వివాదం సర్దుకుంటుందా? లేదా ఇంకా పెద్ద కలకలమే సృష్టిస్తుందా? అదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మిలియన్ డాలర్ ప్రశ్న!