Begin typing your search above and press return to search.

వేటు పడ్డా మాటల దూకుడు ఏంది కొండా?

ఒకప్పుడు ఏ దూకుడు కొండా కుటుంబానికి వరంగా మారిందో..ఇప్పుడు అదే దూకుడు తమకు తిప్పలు తెచ్చి పెడుతుందన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.

By:  Garuda Media   |   15 Sept 2026 9:40 AM IST
వేటు పడ్డా మాటల దూకుడు ఏంది కొండా?
X

‘మాకింత బలం ఉంది. మాకంత సత్తా ఉంది. మేము కానీ బరిలోకి దిగామా.. మాకిక తిరుగే లేదు’ లాంటి మాటలు కొందరు నేతల నోటి నుంచి వింటుంటాం. నిజంగా బలముంటే.. అదేదో అవసరమైనప్పుడు ప్రదర్శిస్తే బాగుంటుందే తప్పించి.. అనవసర సందర్భాల్లో చెప్పుకుంటే తమ డప్పు తామే వాయించుకున్నట్లుగా ఉంటుంది. ఏ నోరు అయితే వరంగా ఉంటుందో.. కొన్ని సందర్భాల్లో అదే నోరు శాపంగా మారుతుంది. కాలానికి అనుగుణంగా..వీసే గాలికి తగ్గట్లు తగ్గకుంటే తగ్గిపోవాల్సి వస్తుందన్న విషయం రాజకీయాల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకప్పుడు ఏ దూకుడు కొండా కుటుంబానికి వరంగా మారిందో..ఇప్పుడు అదే దూకుడు తమకు తిప్పలు తెచ్చి పెడుతుందన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. బంగారం లాంటి మంత్రి పదవిని చేజేతులారా చేజార్చుకున్న క్రెడిట్ కొండా ఫ్యామిలీకే దక్కుతుంది. తమ గురించి.. తమ బలం గురించి వారికి వారు ఎక్కువగా చెప్పుకుంటున్నారన్న మాట ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనూ వినిపిస్తోంది. ఒకప్పుడు కొండా కుటుంబం అంటేనే ఒక బ్రాండ్. దూకుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

కానీ.. కాలం ఆ ప్రభను మసకబారేలా చేసింది. సుదీర్ఘకాలం తర్వాత మంత్రి పదవిని సొంతం చేసుకున్న కొండా కుటుంబం తాము మళ్లీ బలపడటానికి ప్రయత్నించిందే తప్పించి.. తమకు ఒకప్పుడు కోటలా ఉన్న క్యాడర్ ను తమవైపు తిప్పుకోవటానికి.. వారికి మనసుల్లో తమ మీద తగ్గిన అభిమానాన్ని పెంచుకోవటానికి ఉపయోగించుకోకపోవటానికి మించిన పెద్ద తప్పు ఇంకేం ఉంటుంది. ఇందుకు తగ్గట్లే.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల సంబరాలు చేసుకోవటానికి ప్లానింగ్ జరిగిందని.. అయితే సీనియర్ నేతల ఒత్తిడితో ఆ ముప్పు తప్పిందని చెబుతున్నారు.

ఒకవేళ అదే జరిగి ఉంటే.. కొండా కుటుంబానికి భారీ నష్టం వాటిల్లి ఉండేది. రాజకీయాల్లో ఉన్న వారి చేతుల్లో అధికారం లేకపోతే పులి కాస్తా పిల్లిగా మారుతుంది. అలా మారిన పిల్లిని వెక్కిరింతకు గురి చేస్తే అంతకు మించిన అవమానం ఇంకేం ఉంటుంది? ఇలాంటి విషయాలు కొండా ఫ్యామిలీ ఎందుకు మర్చిపోతోంది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించిన వేళ.. ఇంటి బయటకు వచ్చి మీసం మెలేస్తూ మీడియాకు ఫోజులు ఇచ్చిన కొండా మురళి చెప్పాలనుకున్నది ఏంటి?

మీసం మెలేసిన తర్వాత.. దాని పరిణామాలు అప్పటికప్పుడు కాకున్నా వారం.. పదిరోజులకైనా చోటు చేసుకోవాలి కదా? కానీ.. అలాంటిదేమీ జరగలేదు. మంత్రిపదవి పోయిన తర్వాత కొండా దంపతుల కుమార్తె.. తన నోటి దూకుడుతోనే తల్లి పదవి పోయిందని శోకించిన వైనం అవసరమా? చేసే తప్పులు చేస్తే.. దానికి తగిన మూల్యం చెల్లించిన తర్వాత ఏడ్పులతో మరింత పలుచన కావటం తప్పించి.. మరెలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదన్న చిన్న విషయాన్ని మర్చిపోతే ఎలా?

మంత్రి పదవి పోతేనేం.. కొండా దంపతుల్ని హారతి కర్పూరంతో ఆహ్వానించి హత్తుకునే పార్టీలు బోలెడన్న ప్రచారం జరిగింది. కానీ.. అందుకు ఎవరూ సిద్ధంగా లేరన్న విషయం అందరికి అర్థమైంది. ఇలాంటి వేళ.. మౌనాన్ని బద్ధలు చేస్తూ తమకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిందని ప్రకటించిన కొండా ఫ్యామిలీ మాటతో అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఏదీ అసాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నవారు లేకపోలేదు.అయితే.. అధిష్ఠానం నుంచి కొండా కుటుంబానికి పిలుపు వచ్చిన విషయం తన వరకు రాలేదంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పటం ఇప్పుడు చర్చగా మారింది.

మంత్రి పదవి నుంచి తప్పించిన నేతను.. ఢిల్లీకి రావాలని కబురు పంపితే.. ఆ విషయాన్ని రాష్ట్ర పార్టీ బాధ్యులకు తెలియజేయకుండా ఉంటారా? అన్నది ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే కార్యకర్తల మీటింగ్ పెట్టి.. తమకు అండగా నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పటం తప్పు లేదు. కానీ.. ఆ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి.. ‘రేవంత్ అన్నా నీలాంటి మాస్ లీడర్ కాంగ్రెస్ కు అవసరమని చెప్పిన మొదటి వ్యక్తిని నేను’ అని కొండా సురేఖ చెప్పుకోవటం చూసినప్పుడు.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కాదు.. మళ్లీ చేతులు కాల్చుకునే ప్రమాదం వైపు అడుగులు వేయటం ఎందుకు? అన్నది ప్రశ్న.

ఇది సరిపోదన్నట్లు తమకు ప్రత్యామ్నాయంగా అధిష్టానం గుండు సుధారాణికి పదవి కట్టబెట్టిన వేళ.. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఉంటే సరిపోయేది. కానీ.. తమ కడుపులోకి అక్కసును వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. అక్కడితో కానీ ఆగని సురేఖ.. గ్రేటర్ వరంగల్ లో అన్ని సీట్లు గెలుస్తామని.. త్వరలో కొండా మురళికి ఛైర్మన్ పదవి వరిస్తుందన్న సంకేతాలు ఉన్నాయన్న మాటను చూస్తే.. ఎప్పుడు ఏం మాట్లాడాలన్న విషయాన్ని మిస్ అవుతున్నారా? అన్న భావన కలుగక మానదు. నిజంగానే అధినాయకత్వం ఆలోచన అదే అయి ఉంటే.. గౌరవప్రదంగా పార్టీ ముఖ్యుల చేతనో.. పార్టీ చేతనో అధికార ప్రకటన చేయించాలే కానీ.. తమకు తాము చెప్పుకోవటం.. తమ డప్పు తామే వాయించుకున్నట్లు అవుతుంది కదా? ఇలాంటి పాయింట్లను కొండా సురేఖ ఎందుకు మిస్ అవుతున్నారు? కాలం కలిసి రాని వేళ.. చేటు చేస్తున్న నోటికి తాత్కాలికంగా అయినా తాళం వేయాలన్న విషయాన్ని కొండా కుటుంబానికి ఎవరు చెప్పాలి?