కొండాకు బీఆర్ఎస్ డోర్స్ క్లోజ్ !
రేవంత్ రెడ్డి మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయి మాజీ మంత్రిగా నిలిచిన కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తు మీద వాడి వేడిగా చర్చ సాగుతోంది.
By: Satya P | 4 Sept 2026 10:47 PM ISTరేవంత్ రెడ్డి మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయి మాజీ మంత్రిగా నిలిచిన కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తు మీద వాడి వేడిగా చర్చ సాగుతోంది. కొండా సురేఖ తరువాత అడుగులు ఎటు వైపు అన్నది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నా కూడా ఆ పార్టీ అయితే 2028 ఎన్నికల్లో టికెట్ ఇస్తుందా అంటే అది అతి పెద్ద డౌట్ అని అంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు కాంగ్రెస్ లో ఎంత గట్టితో తాజా పరిణామాలతో రుజువు అయింది. దాంతో ఆమె మరో రెండేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటూ ఆ మీదట తన రాజకీయం కొనసాగింపు కోసం వేరే పార్టీలను చూసుకోవాల్సిందే అని అంటున్నారు. ఈ క్రమంలో ఆమె బీఆర్ఎస్ లో చేరుతారు అని కూడా ప్రచారం ఊపందుకుంది. అయితే గులాబీ పార్టీ ఆమెకు కొత్త కాదు, 2014 ఎన్నికల ముందు అందులో చేరి ఎమ్మెల్యే టికెట్ అందుకుని పోటీ చేసి గెలిచారు. అయితే 2018 నాటికి తిరిగి కాంగ్రెస్ గూటికి ఆమె వచ్చేశారు. తిరిగి ఇపుడు ఆమె బీఆర్ఎస్ లోకి వెళ్తారు అని ప్రచారం సాగుతోంది. అయితే ఊహాగానాలుగా వస్తున్న ప్రచారం మాత్రమే. అయితే దీనిని కూడా బీఆర్ఎస్ నేతలు సీరియస్ గానే తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
గేటు కూడా తాకనివ్వం :
మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్నారు అని వస్తున్న వార్తల పట్ల మాజీ మంత్రి బీఆర్ఎస్ లో సీనియర్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి ఘాటుగానే స్పందించరు. ఆమె బీఆర్ఎస్ లోకి వస్తామన్నా ఆహ్వానించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖను కనీసం తెలంగాణా గేటుని కూడా తాకనివ్వమని కుండబద్ధలు కొట్టేశారు. ఈ విషయంలో బీఆర్ ఎస్ కచ్చితమైన వైఖరితో ఉందని ఆయన చెప్పేశారు. అంతే కాదు బీఆర్ఎస్ నుంచి 2023లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన పది మంది ఎమ్మెల్యేలలో తిరిగి వస్తామన్నా కూడా ఒకరిద్దరిని తప్పించి మిగిలిన వారిని చేర్చుకునే సమస్యే లేదని కూడా ఆయన తేల్చేశారు. ఆయన ఎమ్మెల్యేల క్యారెక్టర్ ఆధారంగానే వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని అన్నారు.
బీజేపీ ఆప్షన్ గా :
ఈ నేపథ్యంలో కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తు విషయంలో బీజేపీనే ఏకైక ఆప్షన్ గా కనిపిస్తోంది అని అంటున్నారు. బీజేపీ అయితే ఆమె బర్తరఫ్ పట్ల సానుభూతినే చూపిస్తూ కాంగ్రెస్ మీద విమర్శలు ఎక్కుపెడుతోంది. తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు అయితే ఉన్న మహిళా మంత్రులు ఇద్దరిలో ఒకరిని తీసేసి మహిళా న్యాయం ఏమిటో కాంగ్రెస్ చూపించింది అని విమర్శించారు. బీజేపీలో సీనియర్ మహిళా నేత డీకే అరుణ అయితే సురేఖను వెనకేసుకుని వచ్చి మాట్లాడారు. కుమార్తె చేసిన కామెంట్స్ కి తల్లిని ఎలా శిక్షిస్తారు అని కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు సురేఖను ఫణంగా పెట్టారు అని విమర్శించారు. ఆమె తానూ ఇద్దరమూ వైఎస్సార్ మంత్రి వర్గంలో పనిచేశామని ఆమె సీనియర్ నాయకురాలు అని కూడా ప్రస్తావించారు. దీనిని బట్టి చూస్తే బీజేపీ ఆమె పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉంది అని అంటున్నారు. దీంతో కొండా సురేఖ తన రాజకీయ భవిష్యత్తు మీద ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని అంటున్నారు.
