మంత్రి ఇంటికి మఫ్టీలో పోలీసులు.. చినికిచినికి కొండంత వివాదం?
అటు రాజకీయంగా, ఇటు పాలనాపరంగా తెలంగాణ ప్రభుత్వంలో మహిళా మంత్రి కొండా సురేఖను తరచూ వివాదాలు చుట్టుకుంటుంటాయి.
By: Tupaki Political Desk | 16 Oct 2025 9:38 AM ISTమొత్తమ్మీద ఏదో జరుగుతోంది..! ప్రభుత్వంలోని మంత్రి స్థాయి వ్యక్తి ఇంటికి మఫ్టీ పోలీసులు.. అదీ సొంత జిల్లాకు చెందిన పోలీసులు.. పైగా రాత్రివేళ వెళ్లడం... అన్నిటికీ మించి తొలగించి ఒక ఓఎస్డీ ఏకంగా మంత్రి ఇంట్లోనే ఉన్నారంటూ పోలీసులు వెళ్లడం చూస్తే ఇదే అనుమానం కలుగుతోంది. ఈ అంశం వివాదాస్పదంగా మారేలా కనిపిస్తోంది. అసలే తరచూ వివాదాల్లో ఉండే మంత్రి విషయంలో ఇలా జరుగుతుండడంతో ఏ మలుపు తీసుకుని ఎటు వెళ్తుందో అనిపిస్తోంది.
గాలివాన అవుతుందా..?
అటు రాజకీయంగా, ఇటు పాలనాపరంగా తెలంగాణ ప్రభుత్వంలో మహిళా మంత్రి కొండా సురేఖను తరచూ వివాదాలు చుట్టుకుంటుంటాయి. ఓ ప్రముఖ కుటుంబం విషయంలో ఏడాది కిందట ఆమె చేసిన వ్యాఖ్యలు.. సొంత జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో గ్రూపు తగాదాలు ఆమెను వార్తల్లో నిలిచేలా చేశాయి. మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేరు పార్టీకి సంబంధించి వివాదాల్లో ఎక్కువ వినిపించింది. తాజాగా సురేఖ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా ఉన్న సుమంత్ తొలగింపు వ్యవహారం చర్చనీయాంశం అయింది.
పొంగులేటి పెత్తనం అంటూ...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రఖ్యాతి చెందిన మేడారం జాతర పనుల విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం ఏమిటంటూ కొండా సురేఖ ఫిర్యాదు చేస్తున్నట్లుగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు వెళ్లింది. ఈ మేరకు ఆమె పీఆర్వో నుంచి ప్రకటన మీడియాకు విడుదలైంది. అయితే, ఈ పనుల విషయంలో మంత్రి ఓఎస్డీ సుమంత్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు, ఇతర వ్యవహారాల్లోనూ ఆయన జోక్యం ఎక్కువైనట్లుగా తెలియడంతో ప్రభుత్వం... సుమంత్ ను సురేఖ ఓఎస్డీగా తొలగించింది. ఇది జరిగిన మరుసటి రోజు రాత్రే (బుధవారం రాత్రి) హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మంత్రి సురేఖ ఇంటికి వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో వెళ్లారు.
కొండా ఇంటివద్ద హైడ్రామా..
తమ ఇంటికి మఫ్టీలో వచ్చిన పోలీసులపై మంత్రి కొండా సురేఖ కుమార్తె డాక్టర్ సుస్మిత మండిపడ్డారు. మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ వారిని నిలదీశారు. వరంగల్ పోలీసులు.. సుమంత్ కోసం మంగళవారం నుంచే గాలిస్తున్నారు. ఆయన మంత్రి ఇంట్లో ఉన్నట్లు భావించి మఫ్టీలో వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వారితో సుస్మిత గొడవపడ్డారు. సుమంత్ అరెస్టుకు కారణాలు చెప్పాలంటూ ప్రశ్నించారు.
ఎటువైపు వెళ్తుందో..?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు)లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమితులైన సుమంత్.. తర్వాత మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా డిప్యుటేషన్ పై వెళ్లారు. ఈయనపై ఆరోపణలు తీవ్రమై చివరకు ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్లాయి. దీంతో సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇంటిలిజెన్స్ రిపోర్టు కూడా సుమంత్ కు వ్యతిరేకంగా రావడంతో ఆయనను తొలగించారు. కానీ, అంతటితో ఆగకుండా అరెస్టుకు కూడా ప్రయత్నాలు జరుగుతుండడమే మ్యాటర్ సీరియస్ అని చెబుతోంది. పైగా మంత్రి ఇంటికి మఫ్టీలో రాత్రివేళ సొంత జిల్లా పోలీసులు వెళ్లడం మరింత వివాదంగా మారుతుందా? అనే ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
