Begin typing your search above and press return to search.

కొండక్కకు కాంగ్రెస్ డెడ్ లైన్ !

దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు దీనితో తెరపడినట్లేనని భావిస్తున్నారు.

By:  Garuda Media   |   3 Sept 2026 12:16 PM IST
కొండక్కకు కాంగ్రెస్ డెడ్ లైన్ !
X

మీరు మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుండి బయలుదేరి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకునే లోపు రాజీనామా చేయండి. లేకుంటే పదవి నుండి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ లోని గవర్నర్ కు సిఫార్స్ చేస్తారు’ అని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంత్రి కొండా సురేఖను ఆదేశించినట్లు సమాచారం. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు దీనితో తెరపడినట్లేనని భావిస్తున్నారు.

పదవి నుండి బర్తరఫ్ చేసే అవకాశం ఇవ్వకుండా గౌరవంగా పదవి నుండి తప్పుకోవాలని కొండా సురేఖను పార్టీ అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలోనే నిన్న రాత్రికే కొండా సురేఖ ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారని సమాచారం. తమ భవిష్యత్తు కార్యాచరణ మీద చర్చించడానికి నిన్నటి నుండే సన్నిహితులతో సమావేశానికి ఆహ్వానించారని, ఈ రోజు వారితో సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణను మీడియా సమావేశంలో వివరిస్తారని తెలుస్తుంది.

తాను కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి చేపట్టిన తరువాత తమకు జరిగిన అవమానాలు, రేవంత్ రెడ్డితో వివాదాలు, కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు, పార్టీ క్రమశిక్షణ నోటీసులు, కొండా సురేఖ వివరణ, ఢిల్లీలో జరిగిన పరిణామాలను ఈ సమావేశంలో అనుచరులకు వివరించి, నిర్ణయం తీసుకుని రాజీనామా చేయాలా ? లేక బర్తరఫ్ చేసే వరకు వేచిచూస్తారా ? అన్న విషయం తెలుస్తుంది.

సన్నిహితులతో సమావేశం ఉంటుందని కొండా దంపతులు చెబుతున్నా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో కొండా దంపతులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అక్కడికి వరంగల్ నుండి కానీ, బయట నుండి కానీ సన్నిహితులు ఎవరూ రాలేదు. ఇక ఈ మొత్తం పరిణామాలకు కారణం అయిన కూతురు కొండా సుష్మిత కూడా కొద్ది రోజుల క్రితమే లండన్ కు వెళ్లిపోయారని సమాచారం. ఈ నేపథ్యంలో అసలు కొండా దంపతులు ఏం చర్చిస్తున్నారు ? వారి ఆలోచన ఏంటి ? వారి నిర్ణయం ఏంటి అన్న ఆసక్తి మొదలయింది.

కొండా సురేఖ 1999, 2004, 2009, 2014లలో వరసగా శాయంపేట, పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. 2018లో ఓటమి అనంతరం తిరిగి 2023లో వరంగల్ తూర్పు నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టింది. కొండా మురళి ఒకసారి కాంగ్రెస్ నుండి; ఒకసారి బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఇంతటి రాజకీయ చరిత్ర ఉన్న కొండా దంపతులు రాజకీయంగా ఇలాంటి దశలో ఉండగా సన్నిహితులు ఎవరూ వారి చుట్టూ కనిపించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.