Begin typing your search above and press return to search.

కొండా .. ఔటా ? డౌటా ?!

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో కూడా ఎక్కడా ఫ్లెక్సీలలో కొండా సురేఖ ఫోటోలు ఉండడం లేదు.

By:  Garuda Media   |   1 Sept 2026 9:21 AM IST
కొండా .. ఔటా ? డౌటా ?!
X

తెలంగాణ మంత్రి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరి ఏంటి ? ఆమెను ఢిల్లీకి రమ్మని పిలిచారా ? ఆమెను రాజీనామా చేయాలని కోరారా ? సెప్టెంబరు 3న జరగనున్న సమావేశంలో కొండా సురేఖ భవితవ్యం ఏంటి ? ఒకవేళ రాజీనామా చేయాలంటే ఆమె ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది ? ఆమె నిరాకరిస్తారా ? లేక రాజీనామా చేసి బయటకు వస్తారా ? అన్న ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో కూడా ఎక్కడా ఫ్లెక్సీలలో కొండా సురేఖ ఫోటోలు ఉండడం లేదు. ఆదివారం మమబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, సీతక్కలు హాజరయ్యారు. ఇక్కడ అధికారిక ఫ్లెక్సీలతో పాటు శిలఫలకాల్లో కూడా కొండా పేరు లేకపోవడం చర్చానీయాంశంగా మారింది.

కొండా సురేఖను మంత్రి వర్గం నుండి తప్పించడం ఖాయం అని, అంతర్గతంగా పార్టీ అధిష్టానం దానిని ఆమోదించిందని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాత ప్రకటించడమే తరువాయి అన్న చర్చ నడుస్తుంది. ఏకంగా కొండా సురేఖ పేరు అధికారిక ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకాలలోనే వేయడం లేదు అంటే దానికి అధిష్టానం ఆమోదం ఖచ్చితంగా ఉండి ఉంటుందని అంటున్నారు.

కొండా సురేఖ కూతురు సుష్మిత రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ క్రమశిక్షణ సంఘానికి వివరణ ఇచ్చింది. దానితో ఏకీభవించని క్రమశిక్షణ సంఘం కొండా సురేఖను మంత్రి వర్గం నుండి, చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుండి తొలగించాలని తీర్మానిస్తూ పార్టీ అధిష్టానికి సిఫారసు చేసింది. కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేకపోవడంతో నిర్ణయం వాయిదా పడింది.

అయితే కొండా సురేఖను మంత్రి వర్గం నుండి తొలగిస్తే బీసీ సామాజిక వర్గాల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అన్నది కూడా కాంగ్రెస్ అంచనా వేస్తుంది. ఆమె బీసీ కాబట్టే కుట్రలు చేస్తున్నారని, ఆమెకు అన్యాయం జరిగితే రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడిస్తామని కొన్ని బీసీ సంఘాలు ప్రకటించాయి. అయితే ఆమె మీద చర్య తీసుకుంటే ఏఐసీసీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, వరంగల్ జిల్లాలో వారి ప్రభావాన్ని కూడా అంచనా వేస్తుందని అంటున్నారు.

కొండా సురేఖ ఇప్పటికే క్రమశిక్షణ సంఘానికి వివరణ ఇవ్వడంతో పాటు, బెంగుళూరుకు వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి చర్చలు జరిపింది. సెప్టెంబరు 3న ఢిల్లీలో జరగనున్న సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కొండా సురేఖను పదవి నుండి తొలగించడం, మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అంశాలు ఉంటాయని అంటున్నారు. మరి రేపటి వరకు ఢిల్లీకి రావాలని కొండా సురేఖకు పిలుపు వస్తుందా ? లేదా ? అన్నది ఉత్కంఠగా మారింది.