సీఎం రేవంత్ పై తీవ్రవ్యాఖ్యలు.. కొండా సురేఖ కుమార్తెకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
ఇదిలా ఉండగా వనపర్తి నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది.
By: A.N.Kumar | 19 Aug 2026 10:42 PM ISTతెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్‌కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారనే అభ్యంతరాలతో వివరణ కోరినట్లు తెలుస్తోంది. నోటీసులు అందిన మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కమిటీ ఆదేశించింది.
ఇటీవల కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలతో పాటు.. రానున్న ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం తనకు టికెట్ ఇవ్వకపోతే పరకాల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి కూడా సుస్మితా పటేల్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ.. పార్టీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగా చేసే వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా వనపర్తి నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సైతం నోటీసులు జారీ చేసి, మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మరోవైపు ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పలువురు నేతలను వ్యక్తిగతంగా దూషించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వరుసగా పలువురు నేతలకు నోటీసులు, సస్పెన్షన్ చర్యలు చేపట్టడం తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ క్రమశిక్షణపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేస్తోంది. తాజా నోటీసులపై సుస్మితా పటేల్ ఇచ్చే వివరణ అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌లో మరింత రాజకీయ చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
