రేవంత్ పలుకపడిని పెంచిన కొండా సురేఖ?
రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు లేవు. అధిష్టానం ఆయనను పట్టించుకోవడం లేదు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని పదవి నుండి దించే అవకాశం ఉంది.
By: Garuda Media | 4 Sept 2026 2:23 PM ISTకొండా సురేఖ వివాదం కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెంచిందా ? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎన్ని చెప్పినా రేవంత్ మాటే ఫైనల్ అని కొండా సురేఖను మంత్రి పదవి నుండి తప్పించడం, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుండి తప్పించడం ద్వారా హైకమాండ్ తేటతెల్లం చేసిందా ? అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి.
రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు లేవు. అధిష్టానం ఆయనను పట్టించుకోవడం లేదు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని పదవి నుండి దించే అవకాశం ఉంది. కర్ణాటక తర్వాత తెలంగాణలో రేవంత్ ను పీఠం నుండి దించి మరొకరిని ఎక్కించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తుంది. కొండా సురేఖ సంక్షోభం నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనను 25 రోజుల నుండి 10 రోజులకు కుదించుకోవడం జరిగింది. అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా, ఆయన మాటే నెగ్గింది అన్నట్లుగా కొండా సురేఖను తప్పించడంతో రేవంత్ రెడ్డి విషయంలో పార్టీలో ఉన్న అసంతృప్తి గళాలకు చెక్ పెట్టినట్లేనని భావిస్తున్నారు.
మంత్రి పదవి రాలేదని కొన్నాళ్లుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పరోక్షంగా ఆయన రేవంత్ రెడ్డి మీద, ఇతర మంత్రుల మీద ఆరోపణలు చేస్తున్నారు. అయితే కొండా సురేఖ మీద వేటు వేసిన ఉత్తర్వులు బయటకు రాకముందే రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి పార్టీ నిర్ణయం ఫైనల్ అని ప్రకటించడం విశేషం.
‘కొండా సురేఖ విషయంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్. ఆమె ఏం తప్పులు చేసింది అన్న విషయం మీద అధిష్టానం దగ్గర రికార్డ్ ఉంది. మంత్రివర్గంలో చోటు ఎవరికి దక్కుతుంది అనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి వర్గాన్ని ఎప్పుడు విస్తరించాలి ? అన్న విషయం కూడా అధిష్టానమే నిర్ణయిస్తుంది. రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. ఆయన మీద నాకు నమ్మకం ఉంది’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
కొండా సురేఖ కూతురు సుష్మిత గతంలో సురేఖ ఓఎస్డీని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు వారి నివాసానికి వచ్చినప్పుడు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి మీద, ఇతర మంత్రులు, పార్టీ నేతల మీద ఆరోపణలు చేసింది. ఆ వివాదం అప్పట్లో వెంటనే సమసిపోయింది. తాజాగా రేవంత్ రెడ్డి పరకాల పర్యటన నేపథ్యంలో మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ వస్తుందని ప్రకటించాడు.
అయితే పరకాల టికెట్ పై ఆశలు పెట్టుకున్న కొండా సుష్మిత తన తల్లి జన్మదిన వేడుకల్లో మరోసారి నోరు పారేసుకుంది. టికెట్లు ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరు ? ఇది కొండా ఫ్యామిలీ అడ్డా. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్నికలు పెట్టి ప్రచారం చేయాలి. నేను ఇండిపెండెంట్ గా నిలబడతా. రేవంత్ రెడ్డి తండ్రి, తాత ఎవరు వస్తారో రండి అని సవాల్ విసిరింది.
రేవంత్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖకు ఈ విషయంలో క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కూతురు మాట్లాడిన తర్వాత ఆ మాటలు ఖండించడం గానీ, షోకాజ్ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో గానీ తన కూతురు వ్యాఖ్యలు తప్పని ఖండించడం గానీ, పశ్చాత్తాపం వ్యక్తం చేయడం గానీ చేయలేదు. పైగా తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకేం సంబంధం అని ప్రశ్నించింది.
కొండా మురళి మరో అడుగు ముందుకు వేసి తన కూతురుకు 38 ఏళ్లు, ఆమెకు 12 ఏళ్ల కూతురు ఉంది. ఆమె మాట్లాడవద్దని మేము ఎలా నియంత్రిస్తాం. ఆమెకు మాట్లాడే హక్కు ఉంది. ఆమె ప్లాన్ ఎ అమలు చేసింది. ఆమె ప్లాన్ బి ఏంటో నాకు తెలియదు అని వివాదానికి మరింత ఆజ్యం పోశారనే చెప్పాలి. అటు తల్లి, ఇటు తండ్రి ఇలా మాట్లాడితే రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సుష్మిత వ్యాఖ్యానించడం కొసమెరుపు.
కూతురు వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ కొండా దంపతులు తప్పించుకునే ప్రయత్నాలు చేయడమే కాకుండా, పరోక్షంగా ఆమె వ్యాఖ్యల వెనక తామే ఉన్నాం అన్న సందేశం ఇచ్చారు. ఈ మొత్తం పరిణామాల మీద నివేదిక తీసుకున్న పార్టీ హైకమాండ్ ఆమెను పదవి నుండి తప్పించాలన్న రేవంత్ రెడ్డి వాదనతో ఏకీభవించింది.
బీసీ కార్డు తనను కాపాడుతుందని, ఈ నేపథ్యంలోనే చివరి నిమిషంలో కొండా సురేఖ తాను పద్మశాలి అని, తన భర్త మున్నూరు కాపు అని, తమ సామాజిక వర్గం ఓట్లు 16 శాతం ఉంటాయని వ్యాఖ్యానించింది. అయితే ఆమె వాదనను అధిష్టానం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని, అధిష్టానం తీసుకున్న చర్యలను బట్టి తెలుస్తుంది.
తన భర్త కులం, తన కులం ప్రస్తావనకు తీసుకువచ్చిన క్రమంలో అధిష్టానం ఒకవైపు కొండా సురేఖను తప్పిస్తూనే బీసీ మహిళలు అయిన మున్నూరుకాపు కులానికి చెందిన మహిళా కమీషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా నియమించింది. వరంగల్ జిల్లా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ గుండు సుధారాణిని కుడా చైర్మన్ గా, కరీంనగర్ గౌడ సామాజికి వర్గానికి చెందిన నేరెళ్ల శారదను మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా నియమించడం విశేషం.
మొత్తానికి కొండా సురేఖ వివాదం మొదలు, ఆమెను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన పరిణామాలు అన్నీ పార్టీలో రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తిగా ఉన్న గళాలకు అడ్డుకట్ట వేశాయనే చెప్పాలి. అదే సమయంలో హైకమాండ్ వద్ద రేవంత్ రెడ్డి పలుకుబడి ఏ మాత్రం తగ్గలేదన్న విషయాన్ని బహిర్గతం చేశాయి.
