Begin typing your search above and press return to search.

కేటీఆర్‌పై మహిళా మంత్రి సంచలన వ్యాఖ్యలు.. సంబంధం లేదన్న మాజీ మంత్రి

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 9:35 AM GMT
కేటీఆర్‌పై మహిళా మంత్రి సంచలన వ్యాఖ్యలు.. సంబంధం లేదన్న మాజీ మంత్రి
X

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మెదక్‌లో నిర్వహించిన షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆమె మెడలో చేనేత కార్మికులు తయారు చేసిన నూలు దండను వేశారు. దాంతో అప్పటి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వారిద్దరి తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్నారు. నిన్న ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన సురేఖ.. ఆ ఘటనను గుర్తుచేస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇటు రఘునందన్ రావు కూడా ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ఫైర్ అయ్యారు.

ఈ క్రమంలో ఈ రోజు బాపూఘాట్‌లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ అనంతరం మీడియాతో మాట్లాడారు. దుబాయి నుంచి మూడు అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేస్తున్నారని సురేఖ మండిపడ్డారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని కేటీఆరే తన టీంకు చెప్పారని, ఆయన కనుసన్నల్లోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుస్తోందని అన్నారు. గతంలోనూ మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి పైనా కూడా ఇలాటి అసభ్యకర పోస్టులు పెట్టి ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు బీసీ మహిళనైన తనను కించపరుస్తూ పోస్టు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనపై పోస్టు పెట్టినందుకు హరీశ్ రావు మానవతాదృక్పథంతో స్పందించారని, కానీ కేటీఆర్‌కు మాత్రం ఆ సోయి లేకుండా పోయిందని అన్నారు.

అనంతరం కేటీఆర్‌పై సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. టాలీవుడ్ రియల్ లైఫ్ జంట నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కారణం కేటీఆరేనని అన్నారు. వారు విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అని ఆరోపించారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆటలాడుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, వారికి మత్తు పదార్థాలు అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేశాడని అన్నారు. హీరోయిన్లు తొరగా పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడానికి కారణం కూడా ఈ మాజీ మంత్రేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సినిమా వాళ్లకు అందరికీ తెలుసని, దొంగ ఏడుపులు ఏడవడానికి తనకేం అవసరమని ప్రశ్నించారు. కేటీఆర్‌కు తల్లి, అక్క, చెల్లి, కూతురు లేరా అని నిలదీశారు.

అయితే.. నాగచైతన్య, సమంతలు విడిపోయి దాదాపు మూడేళ్లుపైనే అవుతోంది. తాజాగా మహిళా మంత్రి మరోసారి ఆ జంట ప్రస్తావనాన్ని తీసుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమా ఫీల్డుకు రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ చర్చ ఎటువైపు దారితీస్తుందో తెలియకుండా ఉంది.

మరోవైపు.. సురేఖ ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. మంత్రి సురేఖపై జరిగిన ట్రోలింగుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సురేఖ తమపై ఏడుస్తున్నారని, తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని ఆమె అంటున్నారని పేర్కొన్నారు. తన కుటుంబం, భార్యాపిల్లలు లేరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సమాధానం చెప్పలేకే దాడులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. రేపు ఎల్బీనగర్‌లో పర్యటిస్తానని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేశారు.