Begin typing your search above and press return to search.

కొండా సురేఖ తెగింపు వెనక స్టోరీ ఇదేనా..?

తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరందుకున్న వేళ, ఆమె వ్యూహాత్మ‌కంగా ఎదురు దాడికి దిగారు.

By:  Garuda Media   |   25 Aug 2026 12:00 AM IST
కొండా సురేఖ తెగింపు వెనక స్టోరీ ఇదేనా..?
X

తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరందుకున్న వేళ, ఆమె వ్యూహాత్మ‌కంగా ఎదురు దాడికి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి సురేఖ ఇప్పటికే వివరణ ఇచ్చారు. త‌న కుమార్తె వ్యాఖ్య‌లు ఆమె వ్య‌క్తిగ‌త‌మంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. సొంత పార్టీకి చెందిన నేతలే బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఆమెను పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేయడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సురేఖ, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి మరో లేఖ రాస్తూ.. విచారణ పూర్తికాకముందే తన పరువు తీసేలా వ్యాఖ్యలు చేయిస్తున్న పార్టీ నేత‌ల‌పై ముందు చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు.

ఈ రాజకీయ పోరులో కొండా సురేఖ అత్యంత వ్యూహాత్మకంగా బీసీ సెంటిమెంట్, సామాజిక న్యాయం అనే అంశాలను తెర‌మీద‌కు తెచ్చేశారు. కేబినెట్‌లో సీనియర్ బీసీ మహిళా నేతనైన తనను టార్గెట్ చేస్తూ, దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వేధింపులకు గురిచేస్తుంటే పార్టీ అధిష్టానం నిశ్శబ్దంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తి వ్యక్తిగతమని, ఇతరుల అభిప్రాయాలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారంటూ ప్ర‌శ్నించారు. మైండ్ గేమ్స్ ద్వారా తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తే బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే సంకేతాన్ని అధిష్టానానికి పంపడం ద్వారా తన మంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గ‌త కొంత కాలంగా కొండా సురేఖ‌ను ప్ర‌క్షాళ‌న‌లో కేబినెట్ నుంచి త‌ప్పించి ఆమె స్థానంలో మ‌రొక‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారానికి చెక్ పెట్టేలా... అలాగే త‌న మంత్రి ప‌ద‌విని కాపాడుకునేలా తాజా ప‌రిణామాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకే ఆమె బీసీ వ్యూహాన్ని తెర‌మీద‌కు తెచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఈ బీసీ కార్డు వ్యూహం సురేఖను ఎంతవరకు గట్టెక్కిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి భూముల కేటాయింపులపై సుస్మిత నేరుగా దాడి చేయడాన్ని కాంగ్రెస్ హైకమాండ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో సురేఖపై సస్పెన్షన్ వేటు వేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. క్రమశిక్షణ కమిటీ కూడా సురేఖ వివరణతో సంతృప్తి చెందలేదు. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటన ముగించుకుని రాగానే దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బీసీ వర్గాల అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాకాకుండా వదిలేస్తే సీఎంపై ఆరోపణలు చేసినా చర్యలు ఉండవనే తప్పుడు సంకేతం వెళ్తుంది. ఈ క్రమంలో కొండా సురేఖ విసిరిన బీసీ అస్త్రం ముందు కాంగ్రెస్ హైకమాండ్ తగ్గుతుందో లేక క్రమశిక్షణా చర్యలతో చెక్‌మేట్ పెడుతుందో వేచి చూడాలి.