Begin typing your search above and press return to search.

'కొండా' ఔటైతే ‘రాములమ్మ’ బరిలోకి దిగుతుందా ?!

ఈ మేరకు నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ కు అందజేసింది.

By:  Garuda Media   |   26 Aug 2026 9:57 AM IST
కొండా ఔటైతే ‘రాములమ్మ’ బరిలోకి దిగుతుందా ?!
X

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం గత కొన్ని రోజులుగా కలకలం రేపుతున్నది. అదే సమయంలో కొండా సురేఖతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కూడా పదవి నుండి తప్పించాలని ఎంపీ మల్లు రవి చైర్మన్ గా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సిఫారసు చేసింది. కొండా సురేఖ పలుమార్లు హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదని, గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకున్నా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రి చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చి పార్టీ గౌరవించిందని, కానీ ఆయన పార్టీ నియమావళికి విరుద్దంగా వ్యవహరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడింది.

ఈ మేరకు నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ కు అందజేసింది. ఈ నేపథ్యంలో కొండా మీద వేటు పడితే తరువాత ఆ పదవులు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఇప్పటికే పలువురు ఆశావాహులు ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలు పెట్టారని, అధిష్టానం అనుగ్రహం కోసం పార్టీ ముఖ్యనేతల చుట్టూ తిరుగుతున్నారని ప్రచారం జరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండా సురేఖను మంత్రి పదవి నుండి తప్పిస్తే ఆమె స్థానంలో బీసీ సామాజిక వర్గానికే చెందిన మున్నూరు కాపు, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవులను కూడా భర్తీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి అవకాశం వస్తుంది అన్న చర్చ వస్తుంది.

కొండా సురేఖను పదవి నుండి తప్పిస్తే బీసీ సామాజిక వర్గానికే చెందిన మహిళనైన తనకు క్యాబినెట్ లో అవకాశం కల్పించాలని ప్రముఖనటి, ఎమ్మెల్సీ విజయశాంతి పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం పెద్దల ఎదుట తన ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. ఇక పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి మీద ఆశ పెట్టుకున్నట్లు చాలాకాలంగా చర్చ జరుగుతున్నది. అయితే అదే గౌడ సామాజికి వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉండడం ఆయనకు ప్రతికూలంగా మారింది.

కొండా స్థానంలో వీరు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, ఖాళీగా ఉన్న మంత్రి పదవుల మీద అనేకమంది ఆశలు పెట్టుకున్నారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ కోరుతున్నారు. అయితే సొంత ప్రభుత్వం మీద ఆరోపణల నేపథ్యంలో అధిష్టానం ఆయన విషయంలో ఎలా వ్యవహరిస్తుందో అన్న అనుమానాలు ఉన్నాయి.

ఇక లంబాడా సామాజిక వర్గం నుండి తనకు అవకాశం ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ డిమాండ్ చేస్తుండగా, యాదవ సామాజిక వర్గం నుండి తనకు అవకాశం ఇవ్వాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కోరుతున్నారు. ఈ మేరకు గతంలో యాదవ సామాజిక వర్గం ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఏకంగా గాంధీభవన్లో ఆందోళన కూడా చేసింది. మొత్తానికి కొండా సురేఖ వ్యవహారం మంత్రి వర్గంలో కొత్త మొహాలను చూసే అవకాశం కల్పిస్తుందా ? లేదా ? వేచిచూడాలి.