రేవంత్ వచ్చాక తేల్చుకుంటాం: సురేఖ స్టేట్‌మెంట్
తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ.. తాజాగా మరోసారి స్పందించారు.
By: Garuda Media | 21 Aug 2026 10:36 PM ISTతెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ.. తాజాగా మరోసారి స్పందించారు. అయితే.. నేరుగా మీడియాతో మాట్లాడకుండా ఓ మీడియా సంస్థకు ఫోన్ చేసి ఆమె స్పందించారు. ప్రస్తుతం ఆమె కుమార్తె సీఎం రేవంత్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యల వివాదం ముదిరింది. అటు పార్టీ రాష్ట్ర చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేయడం.. వివరణ కోరడం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఎమ్మెల్యేలు కొందరు సురేఖపై నిప్పులు చెరిగారు. ఆమెను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. అవసరమైతే.. సీఎం రేవంత్ రెడ్డి ఆమెను బర్తరఫ్ చేయాలని కూడా కొందరు ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో సురేఖ స్పందిం చారు. తాను ఇప్పటికే ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా వివరణ ఇచ్చానని తెలిపారు. ఈ విషయంలో తనకు సంబంధం లేదని..అది పూర్తిగా తన కుమార్తె వ్యవహారమని వ్యాఖ్యానిం చారు. ఇంత చేసిన తర్వాత కూడా తనపై వ్యాఖ్యలు చేసేవారిని తానేమీ అనబోనని వ్యాఖ్యానించారు.
ఏదైనా ఉంటే.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత ఆ యనతో మాట్లాడి తేల్చుకుంటానని తెలిపారు. అయితే.. తాను ఎప్పుడూ పార్టీ పట్ల విధేయతతోనే ఉన్నా నని ఆమె వ్యాఖ్యానించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తనకు ఆపాదించడం సరికాదని అన్నారు. తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ప్రత్యర్థులను అయితే ఎదుర్కొం టామని కానీ, సొంత వారే టార్గెట్ చేస్తున్నారని అన్నారు.
ఆరు మాసాల్లో...
గతంలో కూడా సురేఖ కుమార్తె సీఎం రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినప్పుడు.. స్వయంగా సురేఖ సీఎంను కలిసి క్షమాపణలు చెప్పారు. ఇది జరిగి ఆరు మాసాలు కూడా కాలేదు. ఇప్పుడు సురేఖ కుమార్తె.. అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వీటిని ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గానే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గం నుంచి తొలగించడమా? లేక.. ఈ సారికి కూడా సరేలే అని సరిపెట్టుకోవడమా? అనేది సీఎం నిర్ణయాన్ని బట్టే ఆధారపడి ఉంటుందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
