Begin typing your search above and press return to search.

ఇట్లు కొండా సుష్మిత .. సురేఖ !

సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి లక్ష్యంగా సుష్మిత ఆరోపణలు చేసింది.

By:  Tupaki Political Desk   |   21 Aug 2026 9:20 AM IST
ఇట్లు కొండా సుష్మిత .. సురేఖ !
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత రాజేసిన కుంపటి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి విదేవీ పర్యటనలో ఉండడం, సుష్మిత వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మినహా ఇతర సీనియర్ మంత్రులు గానీ, సీనియర్ ఎమ్మెల్యేలు గానీ స్పందించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది.

సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి లక్ష్యంగా సుష్మిత ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా సంఘం మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఎంత వేగంగా నోటీసులు వెళ్లాయో, అంతే వేగంగా నోటీసులకు సురేఖ సమాధానం ఇచ్చింది.

‘తనకు తన కూతురుకు ఉన్నది రక్త సంబంధమే తప్ప రాజకీయ సంబంధం లేదని, తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని, ఆమె మాట్లాడిన మాటలకు తనకు నోటీసులు ఇవ్వడం భావ్యం కాదని, తన వ్యక్తిగత వ్యాఖ్యలకు నేను రాజకీయంగా బాధ్యత వహించాలనడం సముచితం కాదు’ అని మంత్రి కొండా సురేఖ తన సమాధానంలో స్పష్టం చేశారు.

అయితే గురువారం ఇదే సమయంలో కొండా సురేఖ కూతురు కొండు సుష్మిత ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నది. ‘రేవంత్ రెడ్డి మీద చేసిన ఆరోపణలకు మీరు కట్టుబడి ఉన్నారా ? దానికి సంబంధించి మీ వద్ద ఆధారాలు ఉన్నాయా ?’ అని ప్రశ్నించగా, దానికి కొండా సుష్మిత సమాధానం ఇస్తూ ‘తాను బుధవారం చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి షెల్ కంపెనీ టెస్సెరాక్ట్ కు రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టిన విషయం సమాచార హక్కు చట్టం కింద ఆధారాలతో సహా బయటకు వచ్చిందని, అంతకు మించిన ఆధారాలు ఏం కావాలని’ ప్రశ్నించింది.

తాను చేసిన వ్యాఖ్యలకు తన తల్లి కొండా సురేఖకు సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతం అని సుష్మిత సమాధానం ఇవ్వడం గమనార్హం. తన కూతురు వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అని కొండా సురేఖ సమాధానం ఇస్తే, తన వ్యక్తిగత వ్యాఖ్యలతో తన తల్లికి సంబంధం లేదని కొండా సుష్మిత సమాధానం ఇస్తూనే, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పడం, ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా ఉన్నట్లు కనిపించడం లేదు.

అదే సమయంలో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ మీద 20 రోజుల క్రితం వచ్చిన ఫిర్యాదుపై కొండా సుష్మిత రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల తరువాత కేసు నమోదై, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ కావడం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గానీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ గానీ స్పందించక పోవడం గమనార్హం. మరి ఈ వివాధం ఏ మలుపులు తిరుగుతుంది ? ఎక్కడ ఆగుతుంది ? అన్నది వేచిచూడాలి.