Begin typing your search above and press return to search.

'కొండ' వెనక దాగున్నది ఎవరు ?

తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

By:  Garuda Media   |   20 Aug 2026 10:13 AM IST
కొండ వెనక దాగున్నది ఎవరు ?
X

తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గత ఏడాది అక్టోబరులో మేడారం జాతర పనులు తమకు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం టీ కప్పులో తుఫానులా సమసిపోయింది. తాజాగా వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల నేపథ్యంలో ఆమె కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి ఆజ్యం పోశాయి. ఈ సారి పూర్తిగా రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఉండడం ఉత్కంఠ రేపుతున్నది.

తాజాగా వరంగల్ పర్యటన సంధర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి తిరిగి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని, ప్రజలు తిరిగి గెలిపించాలని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే నిన్న వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం గీసుకొండలో జరిగిన కొండా సురేఖ జన్మదిన వేడుకలలో కొండా సుష్మిత స్పందించారు. ‘వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి తానే పోటీ చేస్తానని, యువతకు అవకాశాలు ఇస్తానని చెబుతున్న రేవంత్ రెడ్డి 70 ఏళ్లు పైబడిన రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తానని ఎలా చెబుతారని, సంగారెడ్డిలో జగ్గారెడ్డికి టికెట్ ఏఐసీసీ ఇస్తుందన్న రేవంత్ రెడ్డి, ఇక్కడ మాత్రం తాను ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్పించింది. గతంలో పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఉండాలని తన తల్లి కొండా సురేఖ, తండ్రి కొండా మురళి ప్రతిపాదించారని, తమ ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి 34 సీట్లు వస్తే కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించింది. సీతా దయాకర్ రెడ్డి ఎవరని ఆమెకు పదవి ఇచ్చారని, బీసీ మంత్రుల ఫోటోలు ప్రకటనలలో ఎందుకు వేయడం లేదని, పొంగులేటి పొంగు ఎంతో సేపు నిలవదని, రేవంత్ రెడ్డి తమ్ముడికి రూ.200 కోట్ల భూమి కట్టబెట్టారని, తన వ్యాఖ్యలకు స్పందిస్తే మరిన్ని అక్రమాలు బయటపెడతానని హెచ్చరించడం గమనార్హం.

అయితే సరిగ్గా ఈ నెల 13న కొండా సురేఖ ఒక ప్రముఖ దినపత్రికలో ‘‘పాలించే ప్రభువు కాదు. కలిసి పనిచేసే గుంపుమేస్త్రీ’ అంటూ వ్యాసం రాసింది. సరిగ్గా వారం తిరగకముందే కొండా సురేఖ కూతురు ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం వెనక కారణం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్లు దయాసాగర్, షబ్బీర్ అలీలను ప్రస్తావించడంతో పాటు, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిల గురించి ప్రస్తావించడం అనుమానాలకు తావిస్తుంది.

ఎలాంటి చర్చ లేకుండా కొండా సుష్మిత ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసే అవకాశం లేదని, ఖచ్చితంగా తెరవెనక జరుగుతున్న దానికి అనుగుణంగానే తెర ముందు సుష్మిత ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అసలు కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే వ్యాఖ్యలు కూడా వ్యూహాత్మకమేనని, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు కొండా కుటుంబాన్ని ముందు పెట్టి మాట్లాడిస్తున్నారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితమే కొండా మురళి తన కూతురు వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీ చేస్తుందని, రాబోయే 20 ఏళ్లు తనే ఎమ్మెల్యే అని ప్రకటించారు. దానికి భిన్నంగా రేవంత్ స్పందించిన నేపథ్యంలో దమ్ముంటే ఇప్పుడే రేవూరి ప్రకాష్ రెడ్డితో రాజీనామా చేయించి రేవంత్ రెడ్డి అతడికి మద్దతుగా ప్రచారం చేయాలని, తాను స్వతంత్రంగా పోటీ చేసి గెలుస్తానని సుష్మిత సవాల్ విసిరింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం బుధవారం రాత్రి కొండా సుష్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మరో వైపు పది రోజుల విదేశీ పర్యటన నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, బ్రిటన్ దేశాల సందర్శనకు బయలుదేరారు. ఈ లోపు తెలంగాణలోని కాంగ్రెస్ రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. కొండా కుటుంబం చేస్తున్న వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమా ? లేక పార్టీలోని కొందరు సీనియర్లు ఆడిస్తున్న ఆటనా అనేది కూడా తేలాల్సి ఉంది.