Begin typing your search above and press return to search.

కొణతాల మంత్రి అయితే వైసీపీకి ఇబ్బందేనా ?

ఉమ్మడి విశాఖ జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా కొణతాల రామకృష్ణ ఉన్నారు.

By:  Satya P   |   2 March 2026 9:06 AM IST
కొణతాల మంత్రి అయితే వైసీపీకి ఇబ్బందేనా ?
X

ఉమ్మడి విశాఖ జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఆయన రెండు సార్లు ఎంపీగా మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రాజకీయ జీవితంలో ఓటములు అజ్ఞాత వాసాలు కూడా ఉన్నాయి. అయితే ఆయనకు 2024 ఎన్నికల రూపంలో కాలం కలిసి వచ్చింది. అప్పటికి పుష్కర కాలంగా రాజకీయంగా వెలుగులు లేక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీలో ఇమడ లేక టీడీపీలో అడుగులు వేయలేక నానా రకాలుగా సతమతం అయిన కొణతాల రామక్రిష్ణకు జనసేన రూపంలో మంచి ఆశ్రయం లభించింది. దాంతో ఆయన కూటమి మద్దతుతో మరోసారి ఎమ్మెల్యే అయిపోయారు. అలా ఆయన రాజకీయ సిరి మెరిసింది.

మంత్రి పదవి అంటే :

ఇక కొణతాల రామకృష్ణ మంత్రి అవుతారు అని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు, మంచి వ్యక్తిగా పేరుంది ఆరోపణలు లేవు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దాంతో జనసేన కోటాలో ఉత్తరాంధ్రాలో ఆయనే మంత్రి అని ఫిక్స్ అయిపోయారు. కానీ జరిగింది వేరు ఆయనకు చాన్స్ రాలేదు, పాయకరావుపేట కు చెందిన వంగలపూడి అనితకు మంత్రి యోగం పట్టింది. అయితే తన పని తాను చేసుకుంటూ కొణతాల ముందుకు సాగుతున్నారు.

సబ్జెక్టు మీద పట్టు :

కొణతాల రామక్రిష్ణకు సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉంది. ఆయన ఉత్తరాంధ్ర సమస్యల మీద పూర్తి అవగాహనతో పనిచేసి ఉన్నారు. అందుకే ఆయన సేవలను జనసేన వాడుకోవాలనే ఎమ్మెల్యేగా గెలిపించింది. అయితే ఇపుడు అనూహ్యంగా ఆయనకు మంత్రి పదవి దక్కబోతోంది అని ప్రచారం అయితే సాగుతోంది. జనసేనకు ఉత్తరాంధ్రాలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తప్పించి అంతా కొత్త వారే. ఇక రమేష్ బాబుకు సామాజిక సమీకరణలు అడ్డంకిగా ఉన్నాయి. దాంతో కొణతాలకు మంత్రి పదవి దక్కే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

వైసీపీకి చెక్ అంటూ :

వైసీపీకి చెక్ పెట్టాలీ అంటే కొణతాల రామకృష్ణ వంటి పెద్ద మనిషిని మంత్రి పదవి ఇవ్వాలన్నది కూడా కూటమి వ్యూహంగా ఉంది అని అంటున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి నాయకులు ఉన్నారు కానీ నడిపించే నాధుడు అయితే లేరు. దాంతో ఈ అవకాశాన్ని కూటమి అడ్వాంటేజ్ గా మార్చుకునేందుకు కొణతాల వంటి వారిని ప్రయోగిస్తుంది అని అంటున్నారు. ఇక సౌమ్యుడిగా పేరున్న కొణతాల వల్ల కూటమి ఇమేజ్ పెరగడమే కాకుండా ఆయన అనుభవంతో ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రాలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. అలాగే రాజకీయంగా వైసీపీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే కొణతాల సరైన వ్యక్తి అని అంటున్నారు. ఏది ఏమైనా మంత్రి వర్గ విస్తరణలో కొణతాల పేరు అయితే బాగా నలుగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.