అనుభవం-ఆదరణ.. కొణతాలకు ప్లస్సేనా..?
పర్యటనల సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారా నికి కొణాతాల హామీలు ఇస్తున్నారు.
By: Garuda Media | 17 Sept 2026 6:00 AM ISTప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా జనసేన పార్టీకి చెందిన కొణతాల రామకృష్ణ ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున పోటీ చేసి ఆయన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో ఆయన పనితీరుకు సంబంధించి మిశ్రమ స్పందన వస్తోంది. అనకాపల్లి పరిధిలోని వివిధ వార్డులు, గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ వార్డులలో స్వయంగా పర్యటిస్తూ, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు.
పర్యటనల సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారా నికి కొణాతాల హామీలు ఇస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అయితే, స్థానిక సమస్యల పరిష్కార వేగం ప్రజా సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సమీకరణాల నేపథ్యంలో జనసేన కోటాలో, సీనియారిటీ ప్రాతిపదికన ఆయనకు మొదటి విడత మంత్రివర్గంలో చోటు లభించలేదు.
దీంతో కొణతాల అసంతృప్తితోనే ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత కూడా స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వర్గంతో కొన్ని అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలు చాపకింద నీరులా ఉన్నాయి. అయితే, తాను కూటమి ధర్మాన్ని పాటిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నానని రామకృష్ణ చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, మంత్రి పదవి దక్కకపోయినప్పటికీ, ఉత్తరాంధ్రలోని బలమైన సీనియర్ నేతగా కొణతాల రామకృష్ణ కూటమి ప్రభుత్వంలో జనసేన తరఫున కీలక శాసనసభ్యుడిగా తన రాజకీయాలను కొనసాగిస్తున్నారు.
ప్రజాభిప్రాయం ఏంటి..?
కొణతాల రామకృష్ణపై ప్రస్తుతం ప్రజల్లో సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న వరుస అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కారణంగా ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది.ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం, వార్డుల పర్యటనలు, అభివృద్ధి పనులు ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ వంటివాటిపై సామాన్య ప్రజల్లో రామకృష్ణపై సానుకూల పవనాలు వీచేలా చేస్తున్నాయి. అయితే.. ఇది సరిపోతుందా? అనేది ప్రశ్న. వచ్చే ఎన్నికల నాటికి.. అనకాపల్లిలో పాగా వేయాలని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో రామకృష్ణ మరింతగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది.
