బీఆర్ ఎస్.. త్వరలోనే హెచ్ ఆర్ ఎస్!: కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం బీఆర్ ఎస్ గా ఉన్న ఆ పార్టీ త్వరలోనే హెచ్ ఆర్ ఎస్ పార్టీగా మారుతుందని.. కావాలంటే రాసిపెట్టుకోవాలని.. తెలంగా ణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Garuda Media | 29 Jun 2026 4:05 PM ISTప్రస్తుతం బీఆర్ఎస్ గా ఉన్న ఆ పార్టీ త్వరలోనే హెచ్ ఆర్ ఎస్ పార్టీగా మారుతుందని.. కావాలంటే రాసిపెట్టుకోవాలని.. తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో ప్రజలను గాలికి వదిలేసిన పార్టీలో ఇప్పటికే ఒక చీలిక వచ్చిందన్నారు. త్వరలోనే బీఆర్ ఎస్ కుప్పకూలుతుందని.. మరో పార్టీగా మారుతుందని తెర వెనుక చాలా జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్‌ను ఒకటి అంటే.. తాము పది అంటామని మంత్రి చెప్పారు. దీనిని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.
''మేం పూటకో రంగు మార్చే పార్టీలో ఉన్నామని బీఆర్ ఎస్ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి పూటకో రంగు.. పేరు మారుతున్న పార్టీ బీఆర్ ఎస్ పార్టీనే. గతంలో టీఆర్ ఎస్ పార్టీ పేరును బీఆర్ ఎస్‌గా మార్చి.. దేశాన్ని ఉద్ధరిస్తామని.. కేంద్రంలో పాగావేస్తామని, చక్రాలు తిప్పుతామని అన్నారు. కానీ, ఏమైంది? బీఆర్ ఎస్ పార్టీలోనే చీలికలు వచ్చి.. కవితమ్మ వేరు పార్టీ పెట్టలేదా? ఎవరు రంగులు మార్చారు..? ఎవరు పేర్లు మార్చారు? '' అని మంత్రి కోటమి రెడ్డి నిప్పులు చెరిగారు. ఇప్పుడు కూడా మరోసారి బీఆర్ ఎస్ చీలిక దశకు చేరుకుందన్నారు.
బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీష్‌రావు త్వరలోనే 'హెచ్ ఆర్ ఎస్'(హరీష్‌రావు రాష్ట్ర సమితి) పార్టీ పెట్టడం ఖాయమని.. తనకు ఉన్న సమాచారం మేరకు హెచ్ ఆర్ ఎస్‌కు సంబంధించి తెరవెనుక అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టిన పలు కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ ఎస్ పాలన కారణంగానే నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య నానాటికీ పెరిగిందన్నారు.
పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలోనూ.. దీనికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నల్లగొండకు నిధులు కేటాయించలేదని మంత్రి చెప్పా రు. అందుకే జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడదల చేసిందని.. మూసీ నది ప్రక్షాళనతో జిల్లా వ్యాప్తంగా కృష్ణానది నీరు ఇస్తామని.. తద్వారా ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపుతామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే సుస్థిరంగా కొనసాగుతుందన్నారు. "అవసాన దశలో, చీలిక దశలో ఉన్న పార్టీలు ప్రస్తుత సుస్థిర ప్రభుత్వంపై చేస్తున్న ప్రచారాలు బూటకం. వీటిని నమ్మొద్దు" అని మంత్రి పిలుపునిచ్చారు.
