కోమటిరెడ్డి అలక... అరణ్య రోదనా లేక ?
ఇక విషయానికి వస్తే తెలంగాణా కాంగ్రెస్ లో సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలకలు ఎపుడూ చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి.
By: Satya P | 4 July 2026 11:00 AM ISTరాజకీయాల్లో అలకలు ఉంటాయి. అవి సత్యభామ లాంటి లాంటి అలకలు. తాను అలిగితే పరమాత్ముడు అంతటి శ్రీ క్రిష్ణుడు వచ్చి మరీ బుజ్జగించి అనుకున్నది నెరవేర్చిన ఉదంతం సత్యభామ వ్యవహారం చెబుతుంది. రాజకీయాల్లో కూడా అలకలు కోరికలు తీర్చుకోవడానికే అని అంటారు. ఆ మాటకు వస్తే అలగని నేతలు బహు తక్కువ. ప్రతీ చోటా ప్రతీ ప్రభుత్వంలో ప్రతీ రాజకీయంలోనూ అలకలు పూనిన వారు ఎంతో మంది కనిపిస్తారు. అయితే అందరి అలకలు తీరాలని ఏమీ రూల్ లేదు, అలా అలకలు ఎక్కువగా ఉన్నా విలువ తగ్గి రొటీన్ అయిపోయే సీన్ కూడా ఉంటుంది. ఇక విషయానికి వస్తే తెలంగాణా కాంగ్రెస్ లో సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలకలు ఎపుడూ చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి.
ఆనాడే బీజం పడింది :
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో వచ్చి రెండున్నరేళ్ళు దాటింది. మంత్రివర్గంలో తనకు సీటు దక్కుతుందని ఎంతగానో భావించిన రాజగోపాల్ రెడ్డి తనకు చాన్స్ ద క్కకపోవడంతోన అలకపానుపు ఎక్కారు. సగం పాలన పూర్తి అయినా ఆయన అలక పానుపు దిగడం లేదు, అదే సమయంలో ఆయన మంత్రి పదవి ముచ్చట కూడా తీరడం లేదు అని అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఒకే సామాజిక వర్గం నేతలు మంత్రులుగా ఉన్నారు. ఉత్తం కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ ఈక్వేషన్ ఇలా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డి అన్న. దాంతో ఒకే కుటుంబంలో మంత్రులుగా ఇద్దరికి చాన్స్ అసలు ఇవ్వరు, ఆ విధంగా చూస్తే రాజగోపాల్ రెడ్డికి అసలైన అడ్డంకి ఇంట్లోనే ఉంది అని అంటున్నారు.
ఈసారి అలిగింది మాత్రం :
స్వయంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు కాబట్టి తనకు మంత్రి పదవి దక్కాలి అన్నది రాజగోపాల్ రెడ్డి వాదన. అయితే ఎవరు ఏ హామీ ఇచ్చినా మంత్రివర్గం కూర్పు అంటే అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. దాంతో ఎంత దగ్గర వారికి అయినా ఒక్కోసారి చాన్స్ దక్కకపోవచ్చు. సొంత అన్నయ్య వెంకటరెడ్డి త్యాగం చేస్తే తప్పకుండా రాజగోపాల్ రెడ్డి కోరిక తీరుతుంది, మరి అది జరుగుతుందా అన్నదే మరో ప్రశ్న. ఇదిలా ఉంటే సమయం వచ్చినపుడల్లా తన అసలైన అలకకు కొత్త విషయాలు జోడించి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మీద విమర్శలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి, లేటెస్ట్ గా చూస్తే ఆయన ఒక విషయం మీద అలిగారు, ఆగ్రహించారు. తమ జిల్లా పరిధిలోకి వచ్చే యాదాద్రి ట్రస్ట్ బోర్డు నియామకం విషయంలో కనీస మాత్రంగా స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించకపోవడమేంటి అని గుస్సా అయ్యారు. ఇలా అయితే మేము ఎందుకు అని కూడా లాజిక్ పాయింట్ తీశారు.
కొత్తా పాతా అంటూ :
యాదాద్రి ట్రస్ట్ బోర్డు మీద మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి పాత వారు కాంగ్రెస్ లో ఉంటే వారికి విలువ ఇవ్వడం లేదని ఆక్షేపించారు. అదే సమయంలో కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ లీడర్లు అన్న మాట కూడా వాడారు, వారికి న్యాయం జరగడం లేదని కూడా అన్నారు. ఇలా అయితే తమలాంటి వారికి పార్టీలో కొనసాగడం కష్టతరం అవుతుందని కూడా రాజగోపాల్ రెడ్డి క్లారిటీగా మాట్లాడేశారు. అయితే కోమటిరెడ్డి అలక అన్నది ఇపుడు రొటీన్ గా పార్టీ పెద్దలు కానీ ప్రభుత్వం పెద్దలు కానీ తీసుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. ఆయన సొంత పార్టీలో విపక్ష నేతగా చేస్తున్న కామెంట్స్ ని లైట్ తీసుకుంటున్నారా ఆయన వేదన అంతా అరణ్య రోదన అవుతోందా అంటే ఏమో మరి అని అంటున్నారు.
