Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి వెనక 20 మంది ఆంధ్ర పెత్తందారులు : కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొద్దిరోజులుగా కాంగ్రెస్ లో మంత్రి పదవి కోసం అసమ్మతి రాజేస్తున్న నేత.

By:  A.N.Kumar   |   7 Feb 2026 10:58 PM IST
రేవంత్ రెడ్డి వెనక 20 మంది ఆంధ్ర పెత్తందారులు : కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు
X

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొద్దిరోజులుగా కాంగ్రెస్ లో మంత్రి పదవి కోసం అసమ్మతి రాజేస్తున్న నేత. సందర్భం వచ్చిన ప్రతీసారి కాంగ్రెస్ పెద్దలను ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ ను ఏకతాటిపైకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

తెలంగాణలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని స్థిరపరుచుకుని ప్రజలకు పాలన అందించాల్సిన సమయంలో, పార్టీ నేతల మధ్య పదవుల పోరు తెరపైకి వచ్చింది. మంత్రి పదవులు దక్కలేదన్న అసంతృప్తితో కొంతమంది నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ విమర్శల్లో ముందువరుసలో నిలుస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో తన నియోజకవర్గంలో సాయంత్రం పూట మాత్రమే వైన్ షాపులు నిర్వహించాలని అల్టిమేటం జారీ చేసి సంచలనం సృష్టించిన ఆయన, మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంతో అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వంపై అవకాశం దొరికిన ప్రతిసారీ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా రాజగోపాల్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఖజానాను ఏకంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 20 మంది దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆ వ్యక్తుల వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని, వారికి మద్దతు ఇస్తున్న వారి వివరాలు కూడా తెలుసునని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి.

రాజగోపాల్ రెడ్డి విమర్శల తూటాలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ముఖ్యమంత్రిపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో వైన్ షాపుల ఏర్పాటు, నిర్వహణ విషయంలో కూడా ఆయన వ్యవహారం ఏకపక్షంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షమైన బీఆర్ెస్ తో పాటు వారి అనుబంధ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతున్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.