Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి శాఖకే ఎసరు పెట్టిన కోమటిరెడ్డి?

మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను విద్యాశాఖ మంత్రినైతే ప్రైవేటు స్కూళ్ల‌ను మూసివేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

By:  A.N.Kumar   |   27 Jan 2026 6:41 PM IST
రేవంత్ రెడ్డి శాఖకే ఎసరు పెట్టిన కోమటిరెడ్డి?
X

మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను విద్యాశాఖ మంత్రినైతే ప్రైవేటు స్కూళ్ల‌ను మూసివేస్తాన‌ని ప్ర‌క‌టించారు. న‌ల్గొండ‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉంది. దీంతో రేవంత్ శాఖకే కోమటిరెడ్డి ఎసరు పెట్టాడా? అన్న ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం సీఎం, మంత్రుల మధ్య జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నారాయ‌ణ కాలేజీలో డిగ్రీ చ‌దివిన ఉపాధ్యాయులు ఉంటే.. ప్ర‌భుత్వ కాలేజీల్లో పీహెచ్డీ చేసిన‌వారు ఉంటార‌ని అన్నారు. బ‌ట్టిప‌ట్టి చ‌ద‌వ‌డం వ‌ల్ల విద్యార్థులు ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ స్కూళ్ల‌లోనే చ‌ద‌వించాల‌ని మాట్లాడారు. విద్య వ్యాపారం కాద‌ని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు.

కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌ల‌పై ట్రోలింగ్

కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌ని కొంద‌రు విమర్శిస్తున్నారు. ఎందుకంటే ప్ర‌భుత్వ‌మే ఉద్దేశ‌పూర్వ‌కంగా ప్ర‌భుత్వ బ‌డుల‌ను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట‌వారికి రాచ‌బాట వేస్తుంటే. విద్యాశాఖ మంత్రినైతే ప్రైవేటు స్కూళ్ల‌ను మూసివేస్తాన‌ని మాట్లాడ‌టం హాస్యాస్పదం కాక ఇంకేమ‌వుతోంద‌ని విమ‌ర్శ‌కులు మాట్లాడుతున్నారు. అస‌లు ప్రైవేటు స్కూళ్లును మూసివేయ‌డం మంత్రిత‌రం అవుతుందా అన్న ప్ర‌శ్న కూడా వినిపిస్తోంది. ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌ద‌వించాల‌ని చెప్ప‌డం కంటే ముందుగా.. ఆ బ‌డుల‌ను బాగు చేసి, త‌గినంత మంది ఉపాధ్యాయుల‌ను నియ‌మిస్తే క‌దా ప్ర‌భుత్వ బ‌డుల్లోకి వెళ్లేది అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రభుత్వం ఏ పార్టీదైనా.. ప్రైవేటు వారికి పూల‌దారి వేసి, ప్ర‌భుత్వ బ‌డుల‌ను నిర్వీర్యం చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీ విష‌యంలో ప‌ట్టించుకోవ‌డం లేదు. అదే స‌మ‌యంలో విద్యార్థుల సంఖ్య త‌గ్గింద‌ని మెర్జింగ్ చేస్తున్నారు. ఇలా ఎన్ని విధాలుగా నాశ‌నం చేయాలో అన్ని విధాలుగా విద్యావ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేశాయి ప్ర‌భుత్వాలు. ఇప్పుడు కోమ‌టి రెడ్డి వ్యాఖ్య‌లు ఆహ్వానించ‌ద‌గ్గ‌వే అయిన‌ప్ప‌టికీ వాస్త‌వానికి దూరంగా ఉన్నాయి. ఊహాజ‌నితంగా ఉన్నాయి.

నిర్వీర్యం చేసింది మీరే

విద్య‌ను వ్యాపారం చేసిందే ప్ర‌భుత్వాలు. అనుమ‌తి ఇచ్చిందే ప్ర‌భుత్వాలు. ప్ర‌భుత్వ విద్య‌ను నిర్వీర్యం చేసిందే ప్ర‌భుత్వాలు. ఇప్పుడు అలాంటి ఓ ప్ర‌భుత్వంలోని మంత్రి ప్ర‌భుత్వ బ‌డుల‌ను కాపాడుతాన‌ని మాట్లాడితే జ‌నం న‌వ్వ‌క ఇంకేం చేస్తారు అన్న చ‌ర్చ ఉంది. కోమ‌టిరెడ్డి చెప్పింది ఒక మంత్రిగా చేసే ప‌నికాదు. ప్ర‌భుత్వం భుజాన వేసుకుని చేయాల్సిన పని. ఆ చిత్తశుద్ధి ప్ర‌భుత్వానికి లేకుండా కోమ‌టిరెడ్డి విద్యాశాఖా మంత్రి అయిన‌ప్పుడు చేయ‌గ‌ల‌రా ? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. ఏదిఏమైనా అంప‌శ‌య్య‌పైన ఉన్న ప్ర‌భుత్వ విద్యారంగంపై కోమ‌టిరెడ్డి ప‌లికిన సానుభూతి మాట‌లు విన‌డానికి బాగున్నా, సాకార‌మ‌వుతాయ‌ని న‌మ్మ‌డం మాత్రం అమాయ‌క‌త్వం అవుతుంది.

మ‌న‌సులోంచి వ‌చ్చిందా..

కోమ‌టిరెడ్డి విద్యారంగంపై చేసిన వ్యాఖ్య‌లు మ‌నసు నుంచి వ‌చ్చాయా లేదా ఇంకోదో ..ఎవ‌రికో చెప్పాల‌ని అలా మాట్లాడారా అన్న చ‌ర్చ కూడా ఉంది. ఎందుకంటే రాజ‌కీయ నాయ‌కులు అధికారంలో ఉన్న‌ప్పుడు త‌మ మాట విన‌క‌పోయినా, జ‌ర‌గ‌క‌పోయినా.. ప‌రోక్ష వ్యాఖ్యానం చేస్తుంటారు. తద్వారా త‌మ ల‌క్ష్యాల‌ను సాధించుకుంటారు. ఈ కోణంలో ఏమైనా కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారా అన్న చ‌ర్చ లేక‌పోలేదు. అందుకే ఆయ‌న ఏ కోణంలో చేశారు అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. మంత్రి ఉద్దేశం మంచిదే అయినా ఆచ‌ర‌ణ‌లో చిత్త‌శుద్ధి లేదు క‌దా అన్న‌ది ముఖ్య‌మైన అంశం.