Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి వ‌ర్సెస్ కోమ‌టిరెడ్డి.. ఏంటీ రాజ‌కీయం?

తాజాగా కూడా ఆయ‌న ఈ వ్య‌వ‌హారంపై తీవ్ర విమ‌ర్శ‌లే చేశారు. త‌న‌ను తాను తిట్టుకున్నా.. పార్టీపై ఉన్న అసంతృప్తిని వెళ్ల గ‌క్కారు.

By:  Garuda Media   |   6 Aug 2025 3:21 PM IST
కోమ‌టిరెడ్డి వ‌ర్సెస్ కోమ‌టిరెడ్డి.. ఏంటీ రాజ‌కీయం?
X

కోమ‌టిరెడ్డి కుటుంబంలో రాజ‌కీయ కాక మొద‌లైంది. మంత్రివ‌ర్గంలో చోటు పై ఎన‌లేని ఆశ‌లు పెట్టుకు న్న కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డికి ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చోటు ద‌క్కుతుంద‌ని అంద‌రూ ఆశించారు. ఆయ‌న కూడా.. అలానే ఆశ‌లు పెట్టుకున్నారు. అంతేకాదు.. త‌న‌కు త‌ప్ప‌.. అంటూ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందు కూడా ఆయ‌న కామెంట్లు చేశారు.కానీ, ఒకే కుటుంబంంలో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇస్తే.. చెడు సంకేతాలు వ‌స్తాయ‌న్న ఆలోచ‌న‌తో పార్టీ వెన‌క్కి త‌గ్గింది. కానీ.. రాజా మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

తాజాగా కూడా ఆయ‌న ఈ వ్య‌వ‌హారంపై తీవ్ర విమ‌ర్శ‌లే చేశారు. త‌న‌ను తాను తిట్టుకున్నా.. పార్టీపై ఉన్న అసంతృప్తిని వెళ్ల గ‌క్కారు. గ‌తంలో బీఆర్ ఎస్ హ‌యాంలోనూ.. కాంగ్రెస్ పార్టీలో త‌న‌కు గుర్తింపు లేకుండా పోయింద‌ని భావించే ఎమ్మెల్యే ప‌ద‌వికి రిజైన్ చేశారు. ఈ క్ర‌మంలో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో మ‌ళ్లీ మునుగోడు నుంచే బీజేపీ టికెట్‌పై పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ప‌ట్టుమ‌ని ఏడాది తిర‌గ‌కుండానే.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆ త‌ర్వాత‌.. త‌న‌కు గుర్తింపు త‌థ్య‌మ‌ని అనుకున్నారు. కానీ.. రాజాకు నిరాశే ఎదురైంది.

వాస్త‌వానికి ఏ పార్టీ కూడా.. ఒకే కుటుంబంలో ఇద్ద‌రికి టికెట్‌లు ఇస్తుందేమో.. కానీ.. మంత్రి ప‌ద‌వులు ఇవ్వ డం సాధ్యం కాదు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌గోపాల్‌రెడ్డి కి ఆశ‌లు ఫ‌లించ‌డం లేదు. అయితే.. ఇప్పుడు విషయం అంతా.. కాంగ్రెస్ గూటి నుంచి కోమ‌టిరెడ్డి గూటికే చేరింది. త‌న అన్న‌.. మంత్రి వెంక‌ట‌రెడ్డిపై రాజ‌గోపాల్‌రెడ్డి చేసిన ప‌రోక్ష వ్యాఖ్యలే దీనికి నిద‌ర్శ‌నంగా మారాయి. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌కుండా.. సొంత వారే ఆపుతున్నార‌న్న సందేహాలు ఉన్నాయ‌ని.. చూచాయ‌గా రాజ‌గోపాల్ చెప్పేశారు.

ఆ వెంట‌నే వెంక‌ట‌రెడ్డి ఎక్క‌డా త‌డుముకోకుండా.. 'దీనికి నేనేం చేయను?' అని ప్ర‌శ్నించారు. అంటే.. కోమ‌టిరెడ్డి వ‌ర్సెస్ కోమ‌టిరెడ్డి మ‌ధ్య మంత్రి పీఠం విష‌యంలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు జ‌రుగుతున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కానీ.. వాస్త‌వానికి ఎక్క‌డా ఒకే కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ ఇద్ద‌రికి మంత్రిప‌ద‌వులు ఇచ్చిన దాఖ‌లాలేదు. కానీ.. రాజ‌గోపాల్‌రెడ్డి మాత్రం.. ఇదంతా సొంత ఫ్యామిలీ నుంచే జ‌రుగుతున్న‌ద‌న్న‌ట్టుగా భావిస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి ఇది నిజ‌మేనా? అనేది తేలాల్సి ఉంది.