Begin typing your search above and press return to search.

మంత్రితో వివాదం.. జిల్లాలు దాటేసింది.. !

దీనికితోడు.. నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ..పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు కొలుసుపై ఎక్కువ‌గా ఉన్నాయి.

By:  Garuda Media   |   27 Jan 2026 1:00 PM IST
మంత్రితో వివాదం.. జిల్లాలు దాటేసింది.. !
X

మంత్రి కొలుసు పార్థ‌సార‌థి.. దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ల మ‌ధ్య చోటు చేసుకున్న వివాదం.. బ‌హిరంగ విమ ర్శలు రాజ‌కీయ వేడి పుట్టించిన విష‌యం తెలిసిందే. ఒక‌వైపు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయ‌కులు, మంత్రులు క‌లివిడిగా ఉండాల‌ని చెబుతున్నారు. ఒక‌రికొక‌రు క‌లిసి ప‌నిచేయాల‌ని సూచిస్తున్నారు. కానీ, అనూహ్యంగా చాలా నియోజ‌క వ‌ర్గాల్లో మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయి. కొన్ని చోట్ల మౌనంగా ఉంటే.. మ‌రికొన్ని చోట్ల రోడ్డున ప‌డుతున్నాయి. దీనికి కార‌ణాలు కూడా అనేకం ఉన్నాయ‌ని తెలుస్తోంది.

తాజా వివాదంలో..

తాజాగా వెలుగు చూసిన చింత‌మ‌నేని వ‌ర్సెస్ కొలుసు వివాదానికి కార‌ణాలు.. కేవ‌లం రాజ‌కీయ ప‌ర‌మైన‌వే కాద‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. తెర‌వెనుక‌.. అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిధిలోని కొంద‌రు వైసీపీ నాయ‌కుల‌కు.. కొలుసు ప‌రోక్షంగా స‌హ‌క‌రిస్తున్నార‌న్న వాద‌న ఇప్పుడు టీడీపీలోనూ వినిపిస్తోంది. అయితే.. తాను నిఖార్స ని.. అలా ఎప్ప‌టికీ చేయ‌బోన‌ని కొలుసు త‌న అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చెబుతున్నారు. కానీ, వాస్త‌వానికి.. ప‌శ్చిమ‌లోనికొంద‌రు వైసీపీ నాయ‌కులు.. కాంట్రాక్టులు ద‌క్కించుకోవ‌డం వ్యాపారాలు చేయ‌డం వంటివి చూస్తే.. ఈ వాద‌న తేలిపోతోంద‌ని అంటున్నారు.

దీనికితోడు.. నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ..పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు కొలుసుపై ఎక్కువ‌గా ఉన్నాయి. కొలుసు పార్టీ మారిన త‌ర్వాత‌.. త‌న సొంత వ్యవ‌హారాల కోసం.. వైసీపీ నాయ‌కుల‌తో క‌లివిడిగా ఉండ‌డం.. వారికే కొన్ని ప‌నులు కేటాయించ‌డం.. వారితోనే ముందుకు సాగుతున్నార‌న్న వాద‌న వినిపిస్తున్న నేప‌థ్యంలోనే చింత‌మ‌నేని బ‌య‌ట ప‌ట్టార‌న్న వాద‌న టీడీపీలో పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. ఇలాంటి వాద‌న‌ల‌ను బ‌హిరంగంగా కాకుండా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌కు ప‌రిమితం చేయాల‌ని టీడీపీలో సీనియ‌ర్లు చెబుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాయ‌కులు అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు చేసుకుంటున్నా.. కొంద‌రు బ‌య‌ట ప‌డుతు న్నారు. ముఖ్యంగా చింత‌మ‌నేని గ‌తానికి ఇప్ప‌టికి చాలా మారార‌న్న వాద‌న ఉంది. కానీ, ఇప్పుడు ఆయ‌న‌కు సైతం కోపం వ‌చ్చిందంటే.. ప‌రిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్న చ‌ర్చ కూడా స్థానికంగా జ‌రుగుతోంది. గ‌తంలో కాంగ్రెస్‌.. త‌ర్వాత వైసీపీ ఇప్పుడు టీడీపీలోకి వ‌చ్చిన కొలుసు.. మంత్రి వ‌ర్గంలో చోటు సంపాయించుకున్నారు. దీనికి ఎవ‌రికీ అభ్యంత‌రం లేక‌పోయినా.. ఇంకా వైసీపీతో క‌లిసి ఆయ‌న ప‌నులు చేస్తున్నార‌న్న చ‌ర్చ మాత్రం జోరుగానే కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇదే చింత‌మ‌నేని బ‌య‌ట‌కు చెప్పారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు కూడా విష‌యం వెళ్లింద‌ని స‌మాచారం.