Begin typing your search above and press return to search.

లలిత కుమారి 'రాజ‌కీయం' ప్ల‌స్సా-మైన‌స్సా.. !

ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం శృంగ‌వ‌ర‌పు కోట‌. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రఫున పోటీ చేసిన కోళ్ల ల‌లిత కుమారి విజ‌యం ద‌క్కించుకున్నారు.

By:  Garuda Media   |   24 March 2026 4:00 AM IST
లలిత కుమారి రాజ‌కీయం ప్ల‌స్సా-మైన‌స్సా.. !
X

ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం శృంగ‌వ‌ర‌పు కోట‌. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రఫున పోటీ చేసిన కోళ్ల ల‌లిత కుమారి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆమెకు ఇది మూడో విజ‌యం. గ‌తంలో 2009, 2014లోనూ విజ‌యం ద‌క్కించుకున్నారు. పైగా సామాజిక వ‌ర్గం పరంగా కూడా.. మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. ఇటీవ‌ల కాలంలో ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నారు.

ఇదిలావుంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేద‌న్న వాద‌న సొంత‌పార్టీలోనే వినిపి స్తోంది. గ‌త వైసీపీ హ‌యంలో ఉన్న స‌మ‌స్య‌లు.. ర‌హ‌దారుల స‌మ‌స్య‌.. వంటివి అలానే ఉన్నాయ‌ని.. ఇటీవ‌ల టీడీపీ నాయ‌కులు ఎలుగెత్తారు. అయినా.. లలిత కుమారి వాటిని లైట్ తీసుకున్నారు. పైగా.. ఇలా గ‌ళం వినిపించిన నాయ‌కుల‌పై ప్ర‌త్య‌ర్థుల ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేశారు. వారంతా వైసీపీతో కుమ్మ‌క్క‌య్యారని అంత‌ర్గ‌తంగా వ్యాఖ్యానిస్తున్నారు.

వాస్త‌వానికి ల‌లిత కుమారి నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్‌గా లేర‌న్న‌ది ఇటీవ‌ల ఎమ్మెల్యేల గురించి.. సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టులోనూ స్ప‌ష్ట‌మైంది. కానీ, ల‌లిత కుమారి మాత్రం త‌న‌పై క‌క్ష క‌ట్టిన కొంద‌రు ఇచ్చిన స‌మాచారం ఆధారంగానే రిపోర్టును త‌యారు చేశార‌ని.. ప్ర‌జ‌లంతా త‌న వెంటే ఉన్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. అస‌లుస‌మ‌స్య ఏంటంటే.. ఆమెలోనూ మంత్రి పీఠంపై ఆశ‌లు ఉన్నాయి. మూడు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న త‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

``నిండా రాజ‌కీయాలు కూడా తెలియ‌నివారికి ప‌ద‌వులు ఇస్తున్నారు`` అంటూ.. అనుచ‌ర‌వ ర్గం దగ్గ‌ర ఆమె వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇది అంత‌ర్గ‌తంగా కోళ్ల ల‌లిత కుమారి ఆవేద‌న‌కు కార‌ణ‌మై ఉంటుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. చిత్రం ఏంటంటే.. ఎమ్మెల్యే ప‌నితీరును కానీ.. ఆమె వ్య‌వ‌హారాల‌ను ప్ర‌శ్నించేందుకు వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. కానీ.. సొంత పార్టీలోనే కొంద‌రు నాయ‌కులు త‌ర‌చుగా టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి రావ‌డం.. ఫిర్యాదులు చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ త‌ర‌హా రాజ‌కీయాలు ల‌లిత కుమారికి ప్ల‌స్సా.. మైన‌స్సా అనేది చూడాలి.